“ఎవరిని అడిగి ఈ పనులు చేశారు?” – తమిళనాడు ఉన్నతాధికారులపై గవర్నర్ అర్లేకర్ ఆగ్రహం.. విజయ్ ప్రమాణ స్వీకారంతో మొదలైన చిక్కులు!

2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే వంటి రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను వెనక్కి నెట్టి, తమిళగ వెట్రి కళగం (TVK) తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో, ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన 5గురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినా, టీవీకేకు ఇంకా 6గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఈ క్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన విజయ్.. తన వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 112 మంది మద్దతు ఉందని, పదవి చేపట్టిన తర్వాత మెజారిటీ నిరూపించుకుంటానని లేఖ సమర్పించారు. కానీ, ముందుగా మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ విజయ్‌కు సూచించినట్లు సమాచారం.

మరోవైపు, టీవీకే అధినేత విజయ్ మరియు మంత్రుల ప్రమాణ స్వీకార వేడుక ఈరోజు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడక ముందే, అధికారులు ఈ స్థాయిలో ఏర్పాట్లు చేయడం గవర్నర్ దృష్టికి వెళ్ళింది. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సాయికుమార్, డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్‌లను పిలిపించి క్లాస్ తీసుకున్నారు.

“ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఎటువంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోకముందే, ఎవరిని అడిగి ఈ ఏర్పాట్లు చేశారు? ఒకవేళ వేడుక జరపాలన్నా సాధారణంగా రాజ్‌భవన్‌లోనే జరుగుతుంది కదా.. ఈసారి నెహ్రూ స్టేడియానికి ఎందుకు మార్చారు? వెంటనే ఏర్పాట్లన్నీ నిలిపివేయండి” అని గవర్నర్ ఆవేశంగా ఆదేశించారు. దీంతో స్టేడియంలో జరుగుతున్న పనులు తక్షణమే నిలిచిపోయాయి.

అంతేకాకుండా, ఇంటెలిజెన్స్ విభాగంలో ఇద్దరు కొత్త అధికారుల నియామకంపై కూడా గవర్నర్ డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


Posted

in

by

Tags: