జబల్పూర్కు చెందిన అథర్వ చతుర్వేది అనే వైద్య విద్యార్థి, అనుభవజ్ఞులైన న్యాయవాదులకు కూడా పాఠం నేర్పేలా ప్రవర్తించాడు. తన కేసును సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి, డాక్టర్ కావాలనే తన కలను మళ్లీ చిగురింపజేసేలా తీర్పును పొందాడు.
ఫిబ్రవరి నెలలో ఒక మధ్యాహ్నం, జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని బెంచ్ విచారణ ముగించబోతున్న సమయంలో.. అథర్వ కేవలం 10 నిమిషాల సమయం కోరాడు. ఆ పది నిమిషాల వాదనల తర్వాత, కోర్టు అతని వైపు మొగ్గు చూపింది. ఆర్టికల్ 142ని ఉపయోగిస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రైవేట్ కళాశాలల్లో ప్రొవిజనల్ MBBS అడ్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అథర్వ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాడు? అథర్వ నీట్ పరీక్షలో 530 మార్కులతో రెండుసార్లు క్వాలిఫై అయ్యాడు. అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్ర రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ కళాశాలల్లో EWS కోటా వర్తించకపోవడంతో అతనికి సీటు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ పరమైన లోపాలను సరిదిద్దనంత మాత్రాన అర్హత ఉన్న విద్యార్థికి అడ్మిషన్ నిరాకరించలేమని కోర్టు పేర్కొంది. 2025-26 విద్యా సంవత్సరానికి అతనికి అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
గతంలో జబల్పూర్ హైకోర్టులో అథర్వ వాదనలు విన్న న్యాయమూర్తి, “నువ్వు డాక్టర్ కాదు, లాయర్ కావాల్సింది.. తప్పుడు రంగంలోకి వచ్చావు” అని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.
ఎవరీ అథర్వ చతుర్వేది?
- అథర్వ తండ్రి మనోజ్ చతుర్వేది ఒక న్యాయవాది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో వర్చువల్ కోర్టు విచారణలను గమనించడం ద్వారా అథర్వ కోర్టు క్రమశిక్షణను నేర్చుకున్నాడు.
- సుప్రీంకోర్టు వెబ్సైట్ నుండి పిటిషన్ ఫార్మాట్లను డౌన్లోడ్ చేసుకుని, గత తీర్పులను అధ్యయనం చేసి, జనవరి 6న స్వయంగా పిటిషన్ దాఖలు చేశాడు.
- ఇంజనీరింగ్ మరియు మెడికల్.. రెండింటి ప్రవేశ పరీక్షల్లోనూ అథర్వ ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
