ఎవరు ఈ ఖానానీ సోదరులు? దావుద్ ఇబ్రహీం నకిలీ నోట్ల సామ్రాజ్యాన్ని ‘నోట్ల రద్దు’ ఎలా అంతం చేసింది?

కరాచీ, దుబాయ్, ఢిల్లీ మరియు అమెరికా వరకు విస్తరించిన ఒక భారీ నేర నెట్‌వర్క్, 2016లో భారతదేశం అమలు చేసిన నోట్ల రద్దు తర్వాత కుప్పకూలింది. అల్తాఫ్ ఖానానీ మరియు జావేద్ ఖానానీ అనే సోదరులు దావుద్ ఇబ్రహీంతో కలిసి నడిపిన ఈ సిండికేట్.. నకిలీ కరెన్సీ, ఆయుధాల అక్రమ రవాణా మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేది. ఈ నెట్‌వర్క్ పతనం తర్వాత జావేద్ ఖానానీ అనుమానాస్పద స్థితిలో భవనంపై నుండి పడి మరణించగా, అల్తాఫ్ ఖానానీ ఆచూకీ నేటికీ తెలియదు.

నేపథ్యం: 1947 విభజన సమయంలో గుజరాత్‌కు చెందిన మెమన్ వర్గానికి చెందిన అబ్దుల్ సత్తార్ ఖానానీ కరాచీకి వలస వెళ్లారు. అక్కడ ఒక చిన్న కరెన్సీ ఎక్స్ఛేంజ్ షాపును ప్రారంభించారు. 1961లో ఆయనకు కవల పిల్లలు అల్తాఫ్, జావేద్ జన్మించారు. చదువు తక్కువైనా వ్యాపార మెళకువలు తెలిసిన వీరు, 1980లలో తండ్రి వ్యాపారాన్ని అందిపుచ్చుకున్నారు. అనంతరం హనీఫ్ కాలియా కుటుంబంతో కలిసి ‘ఖానానీ & కాలియా ఇంటర్నేషనల్’ (KKI) అనే సంస్థను స్థాపించారు.

హవాలా మరియు ‘మనీ మెషీన్’: KKI కేవలం కరెన్సీ మార్పిడి సంస్థగా కనిపించినప్పటికీ, లోపల భారీ ‘హవాలా’ నెట్‌వర్క్‌ను నడిపింది. బ్యాంక్ రికార్డులు లేకుండా ఒక దేశం నుండి మరో దేశానికి డబ్బు మార్పిడి చేయడంలో వీరు ఆరితేరారు. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో 40 శాతానికి పైగా వీరి నియంత్రణలోనే ఉండేది. రాజకీయ నాయకులు, అధికారులు తమ నల్లధనాన్ని దాచడానికి వీరినే నమ్మేవారు.

దావుద్‌తో దోస్తీ: 1993 ముంబై పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన దావుద్ ఇబ్రహీంకు, తన డ్రగ్స్ మరియు ఆయుధాల వ్యాపార సొమ్మును తరలించడానికి ఒక నమ్మకమైన మార్గం అవసరమైంది. అప్పుడే ఖానానీ సోదరులు రంగంలోకి దిగి ‘ఖానానీ మనీ లాండరింగ్ ఆర్గనైజేషన్’ (MLO)ను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా ఏటా 14 నుండి 16 బిలియన్ డాలర్ల అక్రమ నగదు లావాదేవీలు జరిగేవని అమెరికా ట్రెజరీ నివేదిక పేర్కొంది.

భారత్‌లో నకిలీ నోట్ల ఉప్పెన: పాకిస్తాన్‌లోని ప్రభుత్వ ముద్రణాలయాల్లో తయారైన అత్యంత నాణ్యమైన నకిలీ భారతీయ నోట్లను దుబాయ్, ఖాట్మండు, డాకా మీదుగా భారత్‌కు చేరవేసేవారు. ఏటా రూ. 1,500 నుండి రూ. 2,000 కోట్ల విలువైన నకిలీ నోట్లు భారత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించేవి. అబ్దుల్ కరీం తుండా వంటి ఉగ్రవాదుల అరెస్టుతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.

నోట్ల రద్దుతో పతనం: నవంబర్ 8, 2016న ప్రధాని మోదీ 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఖానానీ సోదరుల నకిలీ కరెన్సీ నిల్వలు రాత్రికి రాత్రే చిత్తు కాగితాలుగా మారిపోయాయి. దావుద్ మరియు ఇతర అండర్ వరల్డ్ ముఠాల సొమ్మును పోగొట్టుకున్న జావేద్ ఖానానీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మరణం సంభవించింది.


Posted

in

by

Tags: