ఏఐ ఆట మొదలైంది.! “ఆ భయాలన్నీ నిజమవుతున్నాయా..?” ఏఐ వాయిస్‌తో అతిపెద్ద బ్యాంకును బురిడీ కొట్టించి రూ.900 కోట్ల మోసం.. ఆర్థిక ప్రపంచాన్నే వణికించిన ఘటన.!

టెక్నాలజీ పెరిగేకొద్దీ దాన్ని ఉపయోగించి చేసే నేరాలు కూడా హద్దులు దాటుతున్నాయనడానికి నిదర్శనంగా ఇటలీలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

ఇటలీకి చెందిన అతిపెద్ద బ్యాంక్ ‘ఇంటెసా శాన్‌పాలో’ (Intesa Sanpaolo) ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగమైన ‘ఫిడ్యూరమ్’ (Fideuram).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సైబర్ ముఠా వలలో చిక్కి సుమారు 95 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.900 కోట్లు) పోగొట్టుకుంది.

గత ఫిబ్రవరి నెలలో ఈ భారీ కుట్ర జరిగింది. ఫిడ్యూరమ్ బ్యాంక్ అప్పటి ఛైర్మన్ పాలో మోలెసినికి, మాతృ సంస్థ అయిన ఇంటెసా శాన్‌పాలో బ్యాంక్ సీఈఓ కార్లో మెస్సినా పంపినట్లుగా ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అత్యవసర విదేశీ ఆర్థిక లావాదేవీ కోసం తక్షణమే సహాయం చేయాలని అందులో కోరారు.

ఆ మెసేజ్ వచ్చిన వెంటనే, ఓ ప్రముఖ న్యాయ సంస్థకు చెందిన సీనియర్ లాయర్ మాట్లాడుతున్నట్లుగా పాలో మోలెసినికి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి వాట్సాప్ మెసేజ్‌ను ధృవీకరిస్తూ, వెంటనే డబ్బు పంపాలని కోరాడు. వాస్తవానికి, ఆ లాయర్ గొంతును అచ్చం అలాగే అనుకరించడానికి (Voice Cloning) మోసగాళ్ల ముఠా అత్యాధునిక ఏఐ టెక్నాలజీని ఉపయోగించింది!

తన పైఅధికారి, న్యాయవాదే స్వయంగా మాట్లాడుతున్నారని పూర్తిగా నమ్మిన పాలో మోలెసిని.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఫైనాన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసి చైనా, హాంకాంగ్‌లలోని విదేశీ బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా డబ్బు బదిలీ చేయించారు.

డబ్బు చేతులు మారిన తర్వాత గానీ అది ఒక భారీ ఏఐ మోసం అని బ్యాంకు యాజమాన్యానికి అర్థం కాలేదు. వెంటనే అప్రమత్తమైన ఫిడ్యూరమ్ బ్యాంక్ యాజమాన్యం.. అంతర్జాతీయ అధికారులకు, బ్యాంకులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. చైనా, పోర్చుగల్, ఇటలీ అధికారుల ఉమ్మడి ఆపరేషన్‌తో దోపిడీకి గురైన మొత్తంలో సుమారు 53 మిలియన్ యూరోలు (రూ.500 కోట్లకు పైగా) తిరిగి రాబట్టారు.

అయితే, మిగిలిన సుమారు 36 మిలియన్ యూరోలు (దాదాపు రూ.340 కోట్లు) విదేశీ ఖాతాల ద్వారా చేతులు మారి, క్రిప్టోకరెన్సీగా మారిపోవడంతో ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో కనిపెట్టలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఈ భారీ మోసం నేపథ్యంలో బ్యాంక్ ఛైర్మన్ పాలో మోలెసిని “వ్యక్తిగత కారణాలతో” తప్పుకుంటున్నట్లు ప్రకటించి మార్చి నెలలోనే తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనలో బ్యాంకు అధికారులపై ఎలాంటి అనుమానం లేనప్పటికీ, యూరప్ వెలుపల నివసిస్తున్న ఓ విదేశీయుడిపై మిలన్ నగర ప్రాసిక్యూటర్లు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏఐ వాయిస్ టెక్నాలజీని వాడుకుని వందల కోట్లు కొల్లగొట్టిన ఈ మెగా స్కామ్, అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *