ఏడాది తిరగకుండానే వెనువెంటనే 2 విషాదాలు! రాజకుటుంబాన్ని కుదిపేసిన తీవ్ర దుఃఖం.. తల్లి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన కుమారుడు.. భావోద్వేగ దృశ్యాలు!

మేవార్ రాజకుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆ రాజవంశానికి చెందిన రాజమాత విజయరాజ్ కుమారి (83) సోమవారం కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇంట్లోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం కుటుంబ సభ్యులను, మేవార్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

దివంగత విజయరాజ్ కుమారి అంత్యక్రియలు మంగళవారం తెల్లవారుజామున సంప్రదాయబద్ధంగా జరిగాయి. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన రాజవంశ స్మారక స్థలంలో ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆమె కుమారుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ తల్లి చితికి నిప్పంటించారు. ఆ సమయంలో కన్నతల్లిని కోల్పోయిన బాధతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఓదార్చారు.

ఆమె అంతిమ యాత్ర నగరంలోని ప్యాలెస్ ప్రాంగణం నుంచి ప్రారంభమైంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో రాజకుటుంబీకులతో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. జల్లులు పడుతున్నప్పటికీ, రాజమాత కడసారి చూపు కోసం రోడ్డుకిరువైపులా భారీగా జనం తరలివచ్చారు. అంతిమ యాత్ర సాగుతుండగా ప్రజలు ఆమె పార్థివ దేహంపై పూలవర్షం కురిపించి నివాళులర్పించారు.

విజయరాజ్ కుమారి 1942 డిసెంబర్ 21న కచ్ రాజకుటుంబంలో జన్మించారు. అనంతరం మేవార్ రాజకుటుంబానికి కోడలిగా వచ్చి ఉదయ్‌పూర్‌లో స్థిరపడ్డారు. విద్యా రంగంలోనూ ఆమె విశేష సేవలందించారు. ముఖ్యంగా 1980లలో ‘మహారాణా మేవార్ పబ్లిక్ స్కూల్’ అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. గతేడాది మార్చి నెలలోనే ఆమె భర్త అరవింద్ సింగ్ మేవార్ దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. ఏడాది లోపే ఇప్పుడు రాజమాత కూడా కన్నుమూయడం ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది.


Posted

in

by

Tags: