భారతదేశంలో ఏప్రిల్ 1 నుండి జనగణన మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ దశలో ఇళ్ల స్థితిగతులు మరియు కుటుంబ సమాచారాన్ని సేకరిస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడిన జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.
ప్రక్రియ ఇలా ఉంటుంది: భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పౌరులు తమ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో గణన ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు నుండే 16 భాషల్లో ‘స్వయం-గణన’ (Self-Enumeration) ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చు. జనగణన చరిత్రలో ఇలాంటి వెసులుబాటు కల్పించడం ఇదే తొలిసారి.
అడిగే ఆ 33 ప్రశ్నలు ఇవే:
- భవనం నంబర్ (స్థానిక సంస్థ లేదా జనగణన నంబర్)
- జనగణన ఇంటి నంబర్
- ఇంటి నేల తయారీకి వాడిన ప్రధాన పదార్థం
- గోడల తయారీకి వాడిన పదార్థం
- పైకప్పు (Roof) తయారీకి వాడిన పదార్థం
- ఇంటి వినియోగం (నివాసమా? వ్యాపారమా?)
- ఇంటి పరిస్థితి (మంచిదా? శిథిలావస్థలో ఉందా?)
- కుటుంబ సంఖ్య
- కుటుంబంలో నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్య
- కుటుంబ యజమాని పేరు
- యజమాని లింగం
- యజమాని SC/ST/ఇతర వర్గాలకు చెందినవారా?
- సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా?
- అందుబాటులో ఉన్న గదుల సంఖ్య
- కుటుంబంలో ఉన్న వివాహిత జంటల సంఖ్య
- తాగునీటి ప్రధాన వనరు
- తాగునీటి లభ్యత (ఇంటి లోపలా? బయటా?)
- వెలుతురు కోసం వాడే ప్రధాన వనరు (విద్యుత్/ఇతర)
- మరుగుదొడ్డి సౌకర్యం
- మరుగుదొడ్డి రకం
- మురుగునీటి పారుదల సౌకర్యం
- స్నానపు గది సౌకర్యం
- వంటగది మరియు LPG/PNG సౌకర్యం
- వంటకు వాడే ప్రధాన ఇంధనం
- రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా?
- టీవీ ఉందా?
- ఇంటర్నెట్ సౌకర్యం
- ల్యాప్‌టాప్/కంప్యూటర్
- టెలిఫోన్/మొబైల్/స్మార్ట్‌ఫోన్
- సైకిల్/స్కూటర్/మోటార్ సైకిల్
- కారు/జీపు/వ్యాన్
- కుటుంబం తీసుకునే ప్రధాన ఆహార ధాన్యాలు
- మొబైల్ నంబర్ (సమాచార మార్పిడి కోసం మాత్రమే)
వివరాలు ఎలా ఇవ్వాలి? కుటుంబ యజమాని లేదా సభ్యులు అధికారిక పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని, మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించి వివరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత 16 అంకెల ఐడి జనరేట్ అవుతుంది. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడిని చూపిస్తే సరిపోతుంది. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
