ఏప్రిల్ 1, 2026 నుండి పెరగనున్న నిత్యావసర మందుల ధరలు

సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. పారాసిటమాల్ మరియు యాంటీబయోటిక్స్‌తో సహా నిత్యావసర మందుల ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి పెరగనున్నాయి. నిత్యావసర మందుల జాతీయ జాబితా (NLEM)లో ఉన్న ఔషధాల ధరలను సుమారు 0.6% పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ ధరల పెరుగుదల 1,000 కంటే ఎక్కువ నిత్యావసర మందులపై ప్రభావం చూపనుంది. దీనిపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) స్పందిస్తూ.. “వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అందించిన హోల్ సేల్ ధరల సూచిక (WPI) గణాంకాల ఆధారంగా, 2024తో పోలిస్తే 2025 కాలానికి వార్షిక మార్పు (+) 0.64956% గా ఉంది” అని తెలిపింది.

ఏయే ముఖ్యమైన మందుల ధరలు పెరుగుతాయి?

నియంత్రణలో ఉన్న (Controlled) మందుల ధరలను ఏడాదికి ఒకసారి సవరించుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈ జాబితాలో పారాసిటమాల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వాడే యాంటీబయోటిక్ అజిత్రోమైసిన్, రక్తహీనత (Anemia) మందులు, వివిధ రకాల విటమిన్లు మరియు మినరల్స్ ఉన్నాయి. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే కొన్ని మందులు, స్టెరాయిడ్స్ ధరలు కూడా పెరగనున్నాయి.

ఇరాన్ యుద్ధం కారణంగా ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్ల ఫార్మా పరిశ్రమ లాభాలు భారీగా తగ్గాయని, ఈ స్వల్ప పెంపుదల ఆ పరిశ్రమకు కొంత ఊరటనిస్తుందని ఒక అధికారి తెలిపారు.

ధరల పెరుగుదలకు కారణాలు

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా మందుల తయారీకి వాడే ‘యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ ఇంగ్రిడియంట్స్’ (APIs) మరియు సాల్వెంట్స్ ధరలు విపరీతంగా పెరిగాయి.

  • గత కొన్ని వారాలుగా API ధరలు సగటున 30-35% పెరిగాయి.
  • గ్లిజరిన్ ధర 64%, పారాసిటమాల్ ధర 25%, సిప్రోఫ్లోక్సాసిన్ ధర 30% పెరిగాయి.
  • ప్యాకేజింగ్ మెటీరియల్స్ (అల్యూమినియం ఫాయిల్ వంటివి) ఖర్చు కూడా 40% పెరిగింది.
ఫార్మా పరిశ్రమ స్పందన

మందుల తయారీ ఖర్చులు భారీగా పెరిగిన దృష్ట్యా, ప్రభుత్వం ప్రకటించిన 0.6% పెంపు సరిపోదని ఫార్మా కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సిరప్‌లు మరియు డ్రాప్స్‌లో వాడే సాల్వెంట్స్ ధరలు చాలా పెరిగాయని, తమకు మరింత ధరల పెంపు కావాలని వారు NPPAని కోరనున్నారు.


Posted

in

by

Tags: