ఏరోప్లేన్ మోడ్: మొబైల్‌లో ఉండే ఆ ʼచిన్న విమానంʼ బొమ్మ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

మొబైల్‌లో ఉండే ఫ్లైట్ మోడ్ (Flight Mode) ఉపయోగం ఏంటనేది చాలా మందికి తెలియదు. కొంతమంది అసలు దీనిని వాడనే వాడరు. మరికొందరు దీనిని కేవలం విమాన ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించాలని అనుకుంటారు. అసలు విషయానికి వస్తే, మొబైల్ ఫోన్లలో ఉండే ‘ఫ్లైట్ మోడ్’ లేదా ‘ఏరోప్లేన్ మోడ్’ అనేది ఒక ప్రత్యేకమైన ఫీచర్. ఇది తాత్కాలికంగా ఫోన్‌లోని అన్ని వైర్‌లెస్ కనెక్షన్లను – అంటే మొబైల్ నెట్‌వర్క్, వై-ఫై, బ్లూటూత్ మొదలైన వాటిని నిలిపివేస్తుంది. దీనివల్ల విమానం యొక్క నావిగేషన్ సిస్టమ్‌కు ఎలాంటి అంతరాయం కలగదు.

ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంచితే మీకు ఎలాంటి కాల్స్, మెసేజ్‌లు రావు. మీ మొబైల్ కూడా ఇంటర్నెట్‌కు సంబంధించిన ఇతర పనులేవీ చేయదు. మీరు కేవలం ఫోటోలు, వీడియోలు మాత్రమే తీసుకోవచ్చు. విమానంలో ప్రయాణించేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడానికి బదులుగా, ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంచితే సరిపోతుంది. అయితే ఇది కాకుండా, సాధారణ సమయంలో కూడా ఫ్లైట్ మోడ్‌ను ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చు? దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి?

బ్యాటరీని ఆదా చేసే స్మార్ట్ పద్ధతి.. ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంచడం అనేది మీ ఫోన్ బ్యాటరీని ఆదా చేయడానికి ఒక స్మార్ట్ పద్ధతి. నెట్‌వర్క్ బలహీనంగా (సిగ్నల్ తక్కువగా) ఉన్నప్పుడు, మీ ఫోన్ నిరంతరంగా సిగ్నల్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది. కానీ, అవసరం లేనప్పుడు మీరు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం ద్వారా ఫోన్ నెట్‌వర్క్ కోసం వెతకడం ఆపేస్తుంది. ఫలితంగా ఫోన్ బ్యాటరీ చాలా ఎక్కువ సమయం వస్తుంది.

ఫోన్ వేగంగా ఛార్జ్ అవ్వడానికి.. ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టేటప్పుడు మీరు ఫ్లైట్ మోడ్‌లో ఉంచి పెడితే, ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వాలని మీరు కోరుకుంటే, ఛార్జింగ్ పెట్టే ముందు ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయండి. ఇది నెట్‌వర్క్ కార్యకలాపాలను నిలిపివేస్తుంది. దీనివల్ల ఫోన్ 20-25% వేగంగా ఛార్జ్ అవుతుంది.

పిల్లల కోసం సేఫ్ మోడ్ (సురక్షితమైన మోడ్) మీరు పిల్లలకు ఫోన్‌లో గేమ్స్ లేదా వీడియోలు చూపించేటప్పుడు, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం చాలా మంచిది. దీనివల్ల ఇంటర్నెట్ ఆగిపోతుంది. ఫలితంగా వారు ఎలాంటి ఇతర వెబ్‌సైట్లు లేదా యాప్‌లను ఓపెన్ చేయలేరు. మీరు ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి ఉంచిన వీడియోలు, ఫోటోలను మాత్రమే వారికి చూపించవచ్చు.

ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతాలలో, సిగ్నల్ కోసం వెతికే క్రమంలో ఫోన్ చాలా త్వరగా వేడెక్కుతుంది. ఫ్లైట్ మోడ్ ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. దీనివల్ల ఫోన్ ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది మరియు బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే చాలా ఫీచర్లు ఇలాంటివే. అనేక మందికి అవి ఎందుకు ఉంటాయో అస్సలు తెలియదు. ఒక్కసారి కూడా వాటిని వాడరు. అవి మనకు ఉపయోగపడవనే భావనలో ఉంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫీచర్ వెనుక ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని, సరైన పద్ధతిలో ఉపయోగించుకోండి.


Posted

in

by

Tags: