ఏసీతో పాటు ఫ్యాన్ వేయడం కరెక్టా? కాదా? కరెంట్ బిల్లు తగ్గించుకునే సింపుల్ ట్రిక్ ఇక్కడుంది!

ఎండకాలంలో గది త్వరగా చల్లబడాలని చాలా మంది ఏసీతో పాటు ఫ్యాన్‌ను కూడా ఆన్ చేస్తుంటారు. అయితే, ఏసీ, ఫ్యాన్ ఒకేసారి వాడటం సరైనదేనా? దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఫ్యాన్ వేయడం వల్ల ఏసీపై ఒత్తిడి పెరిగి, మిషన్ పాడైపోతుందని కొందరు నమ్ముతుంటారు. కానీ అసలు నిజం దీనికి పూర్తిగా విరుద్ధం. ఏసీ, ఫ్యాన్ అనేవి ఒకదానికొకటి శత్రువులు కావు, ఒక రకంగా చెప్పాలంటే అవి మంచి స్నేహితులు. వీటిని సరైన పద్ధతిలో కలిపి వాడితే గది త్వరగా చల్లబడటమే కాకుండా.. ఏసీపై లోడ్ తగ్గుతుంది, కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.


గది ఎందుకు త్వరగా చల్లబడదు?

వేసవిలో గది బాగా వేడిగా ఉంటుంది. అటువంటప్పుడు మీరు ఏసీని 16, 21 లేదా 24 డిగ్రీల వద్ద రన్ చేస్తే, దానిపై లోడ్ ఎక్కువగా పడి ఆశించిన స్థాయిలో కూలింగ్ రాదు. ఏసీపై లోడ్ పెరిగినప్పుడు కరెంట్ వినియోగం కూడా ఎక్కువవుతుంది, దీనివల్లే మీ ఇంటి కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతుంది.


ఏసీ – ఫ్యాన్ కలిపి వాడితే ఏమవుతుంది?

ఉదాహరణకు మీరు కేవలం ఏసీ మాత్రమే ఆన్ చేశారనుకుందాం. అది గదిలోని గాలిని నెమ్మదిగా చల్లబరుస్తుంది. ఈ ప్రాసెస్‌కు సమయం పడుతుంది, గది పూర్తిగా చల్లబడటానికి దాదాపు అరగంట నుండి గంట సమయం పడుతుంది. గది తక్షణమే చల్లబడాలంటే మీరు ఏసీ టెంపరేచర్‌ను చాలా తక్కువలో (ఉదాహరణకు 16 లేదా 18 డిగ్రీలు) పెట్టాల్సి ఉంటుంది.

కానీ, ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్‌ను కూడా 2 లేదా 3 స్పీడ్‌లో పెడితే.. అది గదిలోని ప్రతి మూలకు చల్లటి గాలిని వేగంగా చేరవేస్తుంది. మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచి, ఫ్యాన్‌ను 3 స్పీడ్‌లో రన్ చేస్తే.. రూమ్ త్వరగా కూల్ అవుతుంది, ఏసీ కంప్రెషర్‌పై కూడా ఎక్కువ లోడ్ పడదు.


కరెంట్ బిల్లు ఎలా ఆదా అవుతుంది?

మీరు ఏసీని నార్మల్ టెంపరేచర్‌లో రన్ చేసినప్పుడు విద్యుత్ వినియోగం దానంతట అదే తగ్గుతుంది, ఎయిర్ కండిషనర్ మిషన్‌పై కూడా ఒత్తిడి పడదు. ఫ్యాన్‌తో పాటు ఏసీ టెంపరేచర్‌ను 24, 25 లేదా 26 డిగ్రీల వద్ద సెట్ చేసుకుంటే, గది చక్కగా చల్లబడుతుంది మరియు కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గుతుంది.


రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర

చాలా మంది రాత్రంతా ఏసీ ఆన్ చేసి ఉంచడం వల్ల గదిలో తేమ (హ్యుమిడిటీ) పెరిగిపోవడమో లేదా ఒక రకమైన వింత వాసన రావడమో జరుగుతుంది. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అదే ఏసీతో పాటు ఫ్యాన్‌ను కూడా తక్కువ స్పీడ్‌లో రన్ చేస్తే, గదిలో తేమ శాతం తగ్గిపోతుంది. ఫ్యాన్ గాలి వల్ల ఏసీ రూమ్‌ను తక్కువ సమయంలోనే సమానంగా చల్లబరుస్తుంది, దీంతో హాయిగా నిద్రపోవచ్చు.


క్విక్ కూలింగ్ టిప్స్
  • మీ గది చాలా పెద్దదిగా ఉంటే, ఖచ్చితంగా పైన పేర్కొన్న పద్ధతిని (ఏసీ + ఫ్యాన్) ప్రయత్నించి చూడండి.
  • ఒకవేళ గది చిన్నదైతే.. మొదట ఏసీని 22 డిగ్రీల వద్ద సెట్ చేసి కొద్దిసేపు రన్ చేయండి, అప్పుడు ఫ్యాన్ ఆపండి. గది కాస్త చల్లబడిన తర్వాత ఏసీ టెంపరేచర్‌ను పెంచి (24 లేదా 25 కి), ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో ఆన్ చేయండి. ఇది మీకు మంచి కంఫర్ట్‌ను ఇవ్వడమే కాకుండా కూలింగ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
  • అలాగే, ఏసీ ఆన్ చేసే ముందు గది కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి, దీనివల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోకుండా రూమ్ త్వరగా కూల్ అవుతుంది.

Posted

in

by

Tags: