“ఐడీ కార్డు ఉంటే నాకేంట్రా..? ముందు బయటకు వెళ్లండి..!” ఇంగ్లాండ్‌లో జర్నలిస్టులను బెదిరించి, ఫోన్ పగలగొట్టిన విరాట్ కోహ్లీ పర్సనల్ బాడీగార్డ్.. వివాదాస్పదమైన కొత్త వీడియో..!!

క్రికెట్ మైదానంలో పరుగులు సాధించడానికి కష్టపడుతున్న విరాట్ కోహ్లీ, ప్రస్తుతం మైదానం వెలుపల ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు, అక్కడ జరుగుతున్న వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే అవుటై అభిమానులను నిరాశపరిచిన కోహ్లీ, ఇప్పుడు తన బాడీగార్డ్ చేసిన అరాచకం కారణంగా మొత్తం మీడియా ఆగ్రహానికి గురయ్యారు.

భారత జట్టు ఆటగాళ్లంతా ఇంగ్లాండ్‌లో తమ బస్సు ఎక్కుతున్న సమయంలో, అక్కడ అధికారికంగా అనుమతి పొంది వార్తలు సేకరించడానికి వెళ్లిన భారతీయ జర్నలిస్టులు, అభిమానులు బస్సు సమీపంలో నిలబడి వీడియోలు తీస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్ జర్నలిస్టులను అత్యంత ఘోరమైన పదాలతో బెదిరించాడు.

దీని గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ సుభయన్ చక్రవర్తి.. “అధికారిక గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్) చూపించినప్పటికీ, ‘దాని గురించి నాకు అనవసరం, ఇక్కడి నుండి వెళ్ళిపోండి’ అని సదరు బాడీగార్డ్ జర్నలిస్టులను నిరంతరం అవమానించాడు” అని పేర్కొన్నారు. ఇది మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న ఒక అభిమాని మొబైల్ ఫోన్‌ను లాక్కొని ఆ బాడీగార్డ్ పగలగొట్టినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

ఈ సంఘటన భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా, భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటగాళ్లందరి భద్రతా బాధ్యతలను బిసిసిఐ (BCCI) చూసుకుంటుంది. ఎప్పుడూ అధికారిక సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీకి మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పర్సనల్ బాడీగార్డ్? బిసిసిఐ నిబంధనలు విరాట్ కోహ్లీకి మాత్రమే మినహాయింపు ఇస్తున్నాయా? అంటూ నెటిజన్లు వరుస ప్రశ్నలను గుప్పిస్తున్నారు. మైదానంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి, అతని బాడీగార్డ్ చేసిన ఈ అనాగరిక ప్రవర్తన ఇంగ్లాండ్ గడ్డపై కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.


Posted

in

by

Tags: