న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2026లో నాలుగోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. మార్చి 28 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్ 2026లో ఆడలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాణా గాయపడటంతో అప్పటి నుండి మైదానానికి దూరంగా ఉన్నాడు. కేకేఆర్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడాల్సి ఉంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, “రాబోయే ఐపీఎల్ సీజన్ నుండి హర్షిత్ రాణా తప్పుకోవడం కేకేఆర్‌కు పెద్ద దెబ్బ. ఫిబ్రవరిలో అతనికి సర్జరీ జరిగింది. అయితే ఈ ఆల్ రౌండర్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై కేకేఆర్ యాజమాన్యం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.”
ఫిబ్రవరిలో సర్జరీ
గాయం తీవ్రత దృష్ట్యా హర్షిత్ రాణా ఫిబ్రవరిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. “సర్జరీ విజయవంతమైంది. ఇప్పుడు కోలుకోవడంపైనే నా దృష్టి” అని అతను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. ఐపీఎల్ సమయానికి అతను ఫిట్ అవుతాడని భావించినప్పటికీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.
కేకేఆర్‌లోకి బ్లెస్సింగ్ ముజరబానీ ఎంట్రీ
మరోవైపు, జింబాబ్వేకు చెందిన ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవైన పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ముజరబానీకి టీ20 క్రికెట్‌లో మంచి అనుభవం ఉంది. అతను 80కి పైగా అంతర్జాతీయ టీ20ల్లో సుమారు 21 సగటుతో 90 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. మార్చి 17న అతను కోల్‌కతాలో జట్టుతో చేరే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు:
అజింక్యా రహానే (కెప్టెన్), రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, కామెరాన్ గ్రీన్, ఫిన్ అలెన్, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, రోవ్‌మన్ పావెల్, అనుకుల్ రాయ్, సార్థక్ రంజన్, దక్ష్ కామ్రా, రచిన్ రవీంద్ర, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, మతీషా పతిరానా, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ఆకాష్ దీప్, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ.
