ఇంట్లో పెళ్లి సందడి, ఉత్సాహం నెలకొన్నాయి. బంధువులు, స్నేహితులు ఇంటికి చేరుకున్నారు. పెళ్లి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గజూ నాథ్ ఇల్లు ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఆయన పెద్ద కుమార్తె రాఖీ వివాహం జరగాల్సి ఉంది. ఆమె వయసు 22 ఏళ్లు.
పెళ్లి జరుగుతుండటంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. ఏప్రిల్ 24న జరిగిన పసుపు (హల్దీ) వేడుకలో రాఖీ ఎంతో ఆనందంగా గడిపింది. డోలక్ శబ్దాలకు అనుగుణంగా ఆమె డాన్స్ కూడా చేసింది. అయితే, ఈ సంతోషం కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంటుందని అప్పుడు ఎవరూ ఊహించి కూడా ఉండరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా కస్రావాడ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఖామ్‌ఖేడాకు చెందిన దిగంబర్ నాథ్‌తో రాఖీకి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 24 సాయంత్రం రాఖీకి పసుపు రాసిన కొద్దిసేపటికే, ఆమె శరీరంలో రియాక్షన్ మొదలైంది. కొద్ది నిమిషాల్లోనే రాఖీ గొంతు, పెదవులు వాచిపోయాయి. ఆమె గొంతు మూగబోయిందని బంధువులు తెలిపారు.
ఈ పరిస్థితి చూసి తల్లిదండ్రులు తీవ్రంగా భయపడ్డారు. అసలేం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఆందోళన చెందిన బంధువులు రాఖీని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను వెంటనే ఇండోర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, జిల్లా ఆసుపత్రి వారు కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని రాఖీ బంధువులు ఆరోపించారు. ఆ తర్వాత తండ్రి తన వద్ద ఉన్న రూ. 4,000 ఖర్చు చేసి, ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆమెను ఇండోర్‌లోని MYH ఆసుపత్రికి తీసుకెళ్లారు.
దారిలోనే ప్రాణాలు విడిచిన రాఖీ
ఏప్రిల్ 25న MYH ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, గజూ నాథ్ వైద్యులతో తన కుమార్తె పెళ్లి విషయమై మాట్లాడారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించారు. రాఖీని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్సకు రూ. 2 నుండి 3 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో, వారు ఆమెను మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగా.. దారిలోనే రాఖీ ప్రాణాలు విడిచింది.
ఆమె ఎంతో సంతోషంగా ఉంది, డాన్స్ చేసింది
కుమార్తె తండ్రి గజూ భాయ్ మాట్లాడుతూ.. “పసుపు అమ్మడానికి వచ్చిన వ్యక్తి దగ్గరే మేము పసుపు కొన్నాము. దాదాపు 10-15 మంది నా కూతురు రాఖీకి పసుపు రాశారు. కానీ ఆమెకు మాత్రమే రియాక్షన్ వచ్చింది. ఆమె ఎంతో సంతోషంగా ఉంది, డాన్స్ చేసింది. నా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం, మరే ఇతర కుటుంబానికి రాకూడదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకనే అతను ప్రాణాలతో బయటపడ్డాడు
ఏప్రిల్ 26న రాఖీ పెళ్లి డోలీ ఎక్కి, ఏడడుగులు వేసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తూ అదే రోజున తండ్రి ఆమె పాడెను మోయాల్సి వచ్చింది. పెళ్లికొడుకు దిగంబర్ నాథ్ వేరే గ్రామంలో ఉన్నాడు. వధువు ఇంటి నుండి వచ్చిన పసుపును అతను ఇంకా రాసుకోలేదు, అందువల్ల అతను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. రాఖీ మరణంతో ఆమె తల్లి సీతాబాయి, సోదరుడు లవకుష్, ఇద్దరు చిన్న చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
