పుణె: పుణె-ముంబై జాతీయ రహదారిలోని ఫుగేవాడి ప్రాంతంలో 48 గంటల వ్యవధిలో 8 మంది మరణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆజాద్ చౌక్ వద్ద ఉన్న శోక సభ ఫలకంపై 8 మంది పేర్లు ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సహజ మరణాలు, గుండెపోటు, కళ్లు తిరిగి పడిపోవడం వంటి వేర్వేరు కారణాలతో వీరు మరణించడంతో గ్రామస్థుల్లో గందరగోళం నెలకొంది.
పోలీసుల వివరణ: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో, వీరందరి మరణాలకు ఒకదానికొకటి సంబంధం లేదని, వేర్వేరు సమయాల్లో, వేర్వేరు కారణాలతో ఈ మరణాలు సంభవించాయని పోలీసులు స్పష్టం చేశారు.
మృతుల వివరాలు:
- పాండురంగ్ ఫుగే (57): వృద్ధాప్యం కారణంగా సహజ మరణం పొందారు.
- విజయ్ రాథోడ్ (31), రాజేంద్ర రాథోడ్ (34): వీరు ఇద్దరూ అన్నదమ్ములు. విజయ్ రాథోడ్ పనిలో ఉండగా గుండెపోటుతో మరణించగా, అన్న మరణవార్త విని తట్టుకోలేక రాజేంద్ర రాథోడ్ కూడా అదే రోజు గుండెపోటుతో కన్నుమూశారు.
- రాజేంద్ర రాజ్‌పుత్ (51): బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయి మరణించారు.
- అక్బర్ పఠాన్ (52): గత 15 ఏళ్లుగా ఉన్న మద్యం అలవాటు కారణంగా అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం.
- మిగిలిన ముగ్గురు (బాబా షేక్, ఆనంద్ దేశాయ్, ఆనంద్ నికాల్జే) కూడా వేర్వేరు ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
నిజం ఏంటి? దాపోడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ వాఘ్మారే మాట్లాడుతూ, చనిపోయిన వారిలో నలుగురికి ఎటువంటి దురలవాట్లు లేవని, శవపరీక్ష నివేదిక వస్తేనే మరణాలకు ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అయితే, 48 గంటల వ్యవధిలో ఎనిమిది మంది మరణించినా, ఎటువంటి ఫిర్యాదులు అందకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
