ఛత్తీస్గఢ్ రాష్ట్రం ధమ్తరి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 35 మంది విద్యార్థులు బ్లేడ్లు మరియు పదునైన వస్తువులతో తమ చేతులను కోసుకుని గాయపరుచుకోవడం సంచలనం సృష్టించింది.
ఘటన వివరాలు: ధమ్తరి జిల్లాలోని ధమ్తకా మిడిల్ స్కూల్లో ఈ వింత ఘటన వెలుగు చూసింది. కొన్ని వారాల క్రితం, ఒక విద్యార్థి చేతిపై కోత గాయాలు ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. దీని గురించి ఆ బాబును ప్రశ్నించగా, తను సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాబును పాఠశాలకు తీసుకువెళ్లి ఇతర విద్యార్థులను గమనించగా, అసలు విషయం బయటపడింది. ఆ స్కూల్లో దాదాపు 35 మంది విద్యార్థులు తమ చేతులను తామే గాయపరుచుకున్నట్లు గుర్తించారు.
ఈ సమాచారం అందిన వెంటనే విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఫిబ్రవరి 16న బాధిత విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక మానసిక కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, విద్యార్థులు ఈ పని ఎందుకు చేశారు? ఇది ఏదైనా ఆన్లైన్ ఛాలెంజ్ ఫలితమా? లేక ఒత్తిడి కారణమా? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకుమార్ సాహు మాట్లాడుతూ.. “విద్యార్థుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి కదలికలను నిశితంగా గమనించాలని ఆదేశించాం. దీనిపై లోతైన విచారణ జరుగుతోంది” అని తెలిపారు. ఒకే పాఠశాలకు చెందిన ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య సదృశ్యంగా తమను తాము గాయపరుచుకోవడం స్థానికుల్లో భయాన్ని, విద్యావ్యవస్థలో పిల్లల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
