మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున కువైట్, ఇరాక్ మరియు బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
కువైట్‌లో కలకలం: కువైట్‌లో తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. శత్రువుల మిస్సైళ్లు, డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని, ఆ క్రమంలోనే ఆ శబ్దాలు వచ్చాయని కువైట్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అమెరికా ఖండన: ఇరాన్ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తోసిపుచ్చింది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళం మరియు ఎయిర్ బేస్‌లపై దాడులు జరిగాయన్న ఇరాన్ ప్రకటన అవాస్తవమని, అన్ని ముప్పులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని అమెరికా పేర్కొంది. ఏ అమెరికా సైనిక స్థావరానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది.
కువైట్ సైన్యం హెచ్చరిక: పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కువైట్ సైన్యం పౌరులను అప్రమత్తం చేసింది. మిస్సైళ్లు లేదా డ్రోన్ల శిథిలాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని తాకవద్దని, వెంటనే అత్యవసర నంబర్‌కు సమాచారం అందించాలని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-ఒటైబీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారిక మూలాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఆయన కోరారు.
ప్రతీకార చర్యే: పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా చేసిన దాడులకు ప్రతిగా కువైట్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేశామని ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్ (IRIB) పేర్కొంది. బహ్రెయిన్ హోం శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. సోషల్ మీడియాలో బహ్రెయిన్ ఆకాశంలో మిస్సైళ్లు వెళ్తున్నట్లు కొన్ని వీడియోలను ఇరాన్ ప్రసార సంస్థ షేర్ చేసింది.

Leave a Reply