ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో చాలామంది ఉపాధి కోసం సొంత ఊళ్లను వదిలి వెళ్లి చిన్న కుటుంబాలుగా విడిపోతున్న రోజుల్లో… ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 83 మంది సభ్యులు కలిగిన ఒక ‘మెగా’ ఉమ్మడి కుటుంబం 6 తరాలుగా ఒకే గూటి కింద కలిసిమెలిసి జీవిస్తోంది.
అనంతపురం జిల్లా గుర్లపల్లి గ్రామానికి చెందిన ఈ కుటుంబ పెద్ద ముత్యాలప్ప పోస్టల్ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, మిగిలిన వారంతా వ్యవసాయం, పశుపోషణ వంటి కుటుంబ పనులను చూసుకుంటున్నారు.
ఒక మహా వృక్షంలా విస్తరించిన ఈ కుటుంబంలో 4 మంది బావమరుదులు, 6 గురు ఆడపడుచులు, 14 మంది కోడళ్లు, 32 మంది పిల్లలతో కలిపి మొత్తం 83 మంది పక్కపక్కనే ఉన్న 3 పెద్ద ఇళ్లలో నివసిస్తున్నారు. ఇప్పటి ఆధునిక యుగంలో కూడా వీరు గ్యాస్ సిలిండర్లు, మిక్సీలు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడకుండా, పెద్ద కట్టెల పొయ్యిలు, రోలు-రోకలి మీదే రోజూ వంట చేసుకుంటారు. మధ్యాహ్న భోజనానికి 50 కేజీల బియ్యం అన్నం, రాత్రి టిఫిన్ కోసం 15 కేజీల గోధుమపిండి చపాతీలు అవసరమవుతాయి. ఆదివారం పూట అయితే ఒక పెద్ద గొర్రె పొట్టేలుతో పాటు 10 కేజీల చికెన్‌ను వండుకుని అందరూ కలిసి ఆరగిస్తారు.
వీరు తమ పొలాల్లో మిరప, టమోటా, బొప్పాయి, వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరి రెక్కల కష్టం వల్ల ప్రారంభంలో 65 ఎకరాలుగా ఉన్న వీరి భూమి ఇప్పుడు ఏకంగా 120 ఎకరాలకు పెరిగింది. ఇది కాకుండా అద్దెకు నడపడానికి 4 బస్సులను కూడా సొంతంగా కలిగి ఉన్నారు. ఒకే వేదికపై ఒకేసారి 9 పెళ్లిళ్లు జరిపించి రికార్డు సృష్టించిన ఈ కుటుంబంలో, వరుసలు కుదిరితే కుటుంబంలోనే వివాహాలు జరిపిస్తారు.
ఇంట్లోని పిల్లలందరూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకుంటున్నారు. 83 మంది సభ్యులు నివసిస్తున్నప్పటికీ 3 ఇళ్లకు కలిపి నెలవారీ కరెంట్ బిల్లు కేవలం రూ.2,700 మాత్రమే రావడం విశేషం. సహజసిద్ధమైన వాతావరణంలో విద్యుత్ వినియోగాన్ని పరిమితంగా వాడుకోవడమే దీనికి కారణం.
తాతల కాలం నాటి నుండి వస్తున్న ఈ అనుబంధాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలు కూడా ఇదే ఐక్యతను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు కుటుంబ పెద్ద ముత్యాలప్ప గర్వంగా చెబుతున్నారు. చిన్నపాటి మనస్పర్థలు కూడా లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తున్న ఈ ఉమ్మడి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply