“ఒక్క రాత్రికే వణికిపోయాను.. వాళ్లంతా ఎలా బతుకుతున్నారో!”.. రష్యా క్షిపణి దాడులకు భయపడి పరుగులు తీసిన హాలీవుడ్ నటుడు.. ఉక్రెయిన్ క్షేత్రస్థాయి పరిస్థితులను పంచుకుని ఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖుడు..!!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో జైమ్ లానిస్టర్ పాత్రలో నటించి గుర్తింపు పొందిన డెన్మార్క్ నటుడు నికోలాయ్ కోస్టర్-వాల్డౌ, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) గుడ్‌విల్ అంబాసిడర్‌గా వెళ్లారు. అక్కడ ఉక్రెయిన్ ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న భయంకరమైన యుద్ధ పరిస్థితులను స్వయంగా చూసిన ఆయనకు ఊహించని షాక్ ఎదురైంది.

రాజధాని కీవ్ నగరంలో రష్యా క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందన్న వైమానిక దాడుల హెచ్చరికలు జారీ కావడంతో, ప్రాణభయంతో నటుడు నికోలాయ్ అక్కడి స్థానికులతో కలిసి మెట్రో రైల్వే స్టేషన్ అండర్‌గ్రౌండ్‌లో (సొరంగ మార్గంలో) తలదాచుకున్నారు. నీలం రంగు జాకెట్ ధరించి, తనకు అవసరమైన వస్తువులున్న బ్యాగ్‌ను చేతబట్టుకుని, మెట్రో స్టేషన్‌లోని ఒక చిన్న మంచంపై రాత్రంతా గడిపిన అనుభవాన్ని, అందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.

ఈ అనుభవం గురించి ఆయన పోస్ట్ చేస్తూ, “నేను కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఈ భయంకరమైన పరిస్థితిని అనుభవించి మాట్లాడుతున్నాను; కానీ, వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రతిరోజూ ఈ బాంబు దాడుల భయంతోనే బతుకుతున్నారు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కఠినమైన శీతాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, తీవ్ర కష్టాల్లో జీవిస్తున్న ఉక్రెయిన్ ప్రజలకు అంతర్జాతీయ సమాజం వెంటనే సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Posted

in

by

Tags: