తమిళనాడు మధ్య భాగంలోని ఒక నియోజకవర్గానికి చెందిన ఒక ధనిక అభ్యర్థి, ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 25 వేల చొప్పున పంపిణీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి సదరు నియోజకవర్గంలో ఆయనపై పోటీ చేస్తున్న ఇతర అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. వీటికి సంబంధించిన ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు, బహుమతులను స్వాధీనం చేసుకుంటున్నారు.
అయితే, ఎన్నికల అధికారుల కళ్లు గప్పి అభ్యర్థులు భారీగా నగదు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అక్కడక్కడా ఒక ఓటుకు రూ. 1000, రూ. 1500, రూ. 5000 వరకు ఇస్తుండగా.. ఒక ధనిక అభ్యర్థి మాత్రం ఏకంగా రూ. 25 వేలు పంపిణీ చేస్తున్నారట.
రూ. 500 కోట్ల పంపిణీ? సదరు నియోజకవర్గంలో సుమారు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఆ లెక్కన చూస్తే, కేవలం ఓట్ల కోసమే ఆయన దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండవచ్చని తెలుస్తోంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే, ఆ కుటుంబానికి ఏకంగా రూ. 1 లక్ష వరకు అందుతోంది. దీనికి పోటీగా ప్రత్యర్థి అభ్యర్థి రూ. 6000 చొప్పున పంచుతున్నారట. అయితే ధనిక అభ్యర్థి ఇస్తున్న భారీ మొత్తంతో పోలిస్తే తన గెలుపు సాధ్యమేనా, తాను పంచిన రూ. 6000 వృథా అవుతుందా అని ఆయన ఆందోళన చెందుతున్నారట.
స్వతంత్ర అభ్యర్థుల ఆవేదన: చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ ధనిక అభ్యర్థి నుండి రూ. 25 వేలు అందడంతో.. “కనీసం మన కుటుంబం మనకు ఓటు వేస్తుందా?” అనే అనుమానం వారిలో మొదలైంది. దీంతో పార్టీలకతీతంగా అభ్యర్థులందరూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి, ఆ ధనిక అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని యోచిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఓటుకు డబ్బు ఇవ్వడం ఎంత నేరమో.. ఆ డబ్బును తీసుకోవడం అంతకంటే పెద్ద నేరం. ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును నగదుకు అమ్ముకోకుండా, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
