భారతదేశంలో ప్రస్తుతం బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు లక్షా పాతిక వేల రూపాయలకు పైగానే ఉంది. అయితే, ప్రపంచ పటంలో ఒక దేశం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ బంగారం ధర మీ ఉదయం టీ మరియు టిఫిన్ ఖర్చు కంటే తక్కువగా ఉండటం విశేషం.
దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా (Venezuela) దేశంలో ప్రస్తుతం బంగారం లెక్కలు తలకిందులయ్యాయి. అక్కడి 24 క్యారెట్ల బంగారం ధర వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
ఒక కప్పు టీ.. ఒక గ్రాము బంగారం.. రెండింటి ధర ఒకటే!
భారతదేశంలో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు ₹13,800 నుండి ₹13,900 వరకు ఉంది. దీనికి భిన్నంగా, వెనిజులాలో అదే 24 క్యారెట్ల బంగారం ధర భారతీయ కరెన్సీలో కేవలం ₹181 (గ్రాముకు) మాత్రమే. ఇక 22 క్యారెట్ల బంగారం అయితే కేవలం ₹166 కే లభిస్తోంది. అంటే, భారత్‌లో మనం ఒక పాలు-బ్రెడ్ ప్యాకెట్ లేదా హోటల్లో ఒక కప్పు టీ కోసం ఎంత ఖర్చు చేస్తామో, అంత ధరకే వెనిజులాలో ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
బంగారం ఇంత చవకగా ఎందుకు ఉంది?
వెనిజులాలో బంగారం ఇంత తక్కువ ధర ఉండటం ఆ దేశ ఆర్థిక స్థితిగతులకు చిహ్నం కాదు, అది కుప్పకూలిన అక్కడి ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. దీనికి ప్రధాన కారణాలు:
- కరెన్సీ పతనం: వెనిజులా కరెన్సీ ‘బోలివర్’ విలువ దారుణంగా పడిపోయింది. ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే, అక్కడి కరెన్సీ నోట్లు కేవలం కాగితపు ముక్కలుగా మారిపోయాయి.
- బంగారు నిల్వల వినియోగం: దేశంపై ఉన్న అప్పులు తీర్చడానికి అధ్యక్షుడు నికోలస్ మదురో హయాంలో భారీగా బంగారాన్ని విదేశాలకు తరలించారు. 2013-2016 మధ్య సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు పంపారు.
- అంతర్జాతీయ ఆంక్షలు: వెనిజులాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు మరియు అంతర్గత అవినీతి కారణంగా, ప్రపంచ మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా అక్కడి ధరలు పడిపోయాయి.
సంపద ఉన్నా పేదరికంలో దేశం!
వెనిజులా సహజ వనరుల పరంగా అత్యంత సంపన్న దేశం. ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు ఈ దేశం వద్ద ఉన్నాయి. ఇక్కడి ‘ఒరినోకో మైనింగ్ ఆర్క్’ ప్రాంతంలో దాదాపు 8,000 టన్నుల బంగారం మరియు ఇతర ఖనిజాలు ఉన్నట్లు అంచనా. అయితే, తప్పుడు విధానాలు మరియు రాజకీయ అస్థిరత వల్ల నేడు అక్కడ బంగారం మట్టి ధరకే దొరుకుతున్నా, సామాన్యులకు రెండు పూటలా తిండి దొరకడమే కష్టంగా మారింది.
