ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో వివాహితుడైన వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్లగా, ఆమె కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన షాజాద్ (ఇలియాస్) అనే వివాహితుడు, బుధవారం రాత్రి ఖాసింపూర్ గ్రామంలో నివసిస్తున్న తన ప్రియురాలు గుల్ఫాషాను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆగ్రహించిన యువతి బంధువులు అతడిని తాళ్లతో కట్టి తలకిందులుగా వేలాడదీసి చితకబాదారు. అంతేకాకుండా, అతడిని విడిచిపెట్టడానికి రూ. 5 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాత్రంతా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన షాజాద్ కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లి రక్షించారు. ఈ క్రమంలో మధ్యవర్తుల ద్వారా రూ. 5 లక్షలు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందనప్పటికీ, వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సహారన్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడింది ఎవరు, డబ్బులు వసూలు చేశారా లేదా అనే అంశాలపై బెహత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రియా యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
