దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై నిరంతరం చర్చలు జరుగుతున్నప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో వారిపై జరిగే ఆగడాలు మాత్రం ఆగడం లేదని స్పష్టం చేసేలా మరో దారుణ ఘటన వెలుగుచూసింది.
ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే వ్యాపార కేంద్రమైన సదర్ బజార్లో పట్టపగలే జనసందోహాన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు మహిళలను వేధింపులకు గురిచేశాడు. రద్దీని అడ్డం పెట్టుకుని, అటుగా నడిచి వెళ్తున్న మహిళలను వరుసగా వెంబడిస్తూ అసభ్యకరంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు.
అదే సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి ఈ వికృత చేష్టలను గమనించి, తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా, ఆ పోకిరీని నేరుగా నిలదీసి అక్కడికక్కడే అడ్డుకున్నాడు. తన నిర్వాకం వీడియోలో రికార్డవుతోందని, జనం నిలదీస్తున్నారని గ్రహించిన ఆ కామాంధుడు క్షణాల్లో అక్కడి నుంచి తోకముడిచి పరుగులు తీశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదీప్ చౌదరి అనే నెటిజన్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. సదర్ బజార్లో మహిళలు ఎదుర్కొంటున్న దుస్థితిని ఎత్తిచూపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు, ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. “బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఇలాంటి అకృత్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు; పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ దుండగుడిని వెంటనే గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply