ఓటమితో రాజకీయాలకు ఖేసరి లాల్ యాదవ్ గుడ్‌బై? నిజాయితీగా ఉంటే ఇక్కడ మనలేమని వ్యాఖ్య

ప్రముఖ భోజ్‌పురి నటుడు, సింగర్ ఖేసరి లాల్ యాదవ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం చేయాలంటే అబద్ధాలు చెప్పడం రావాలని, అది లేకపోతే ఇక్కడ రాణించడం కష్టమని ఆయన అన్నారు. తనవల్ల అబద్ధాలు చెప్పడం సాధ్యం కాదని, అందుకే తాను రాజకీయ నాయకుడిగా పనికిరానని తేల్చి చెప్పారు.

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ (RJD) తరపున పోటీ చేసిన ఖేసరి లాల్ యాదవ్.. రాజకీయం తన వల్ల కాదని, తాను కళాకారుడిగానే బాగున్నానని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరుతారనే వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఛప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, ఎన్డీయే అభ్యర్థి ఛోటీ కుమారి చేతిలో ఓటమి పాలయ్యారు.

అబద్ధం చెప్పేవాళ్లే ఇక్కడ ఉంటారు: మీడియాతో మాట్లాడిన ఖేసరి లాల్ యాదవ్.. “కళాకారుల ప్రపంచం వేరు, అక్కడ అబద్ధాలకు చోటుండదు. కానీ రాజకీయాల్లో సమయాన్ని బట్టి అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. అబద్ధాలు చెప్పేవాళ్లే ఇక్కడ నిలదొక్కుకోగలరు. నిజం మాట్లాడి రాజకీయం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నన్ను కళాకారుడిగానే ఉండనివ్వండి. రాజకీయం నా వల్ల అయ్యే పని కాదు” అని పేర్కొన్నారు. తన మొదటి ఎన్నికలే చివరివని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

పాట ఏదైనా, అది భోజ్‌పురి గౌరవాన్ని పెంచుతోందని పవన్ సింగ్ పాటపై స్పందిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భోజ్‌పురి పాటను గుర్తించడం సంతోషమని, కళాకారులు, క్రీడాకారులు కలిసి భోజ్‌పురి ఖ్యాతిని పెంచుతారని అన్నారు.


Posted

in

by

Tags: