రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక చిన్న ఘటన, సోషల్ మీడియాలో లక్షలాది మంది ప్రజల మనసులను హత్తుకుంది. కదులుతున్న రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ పావ్ ఇవ్వడం కోసం, ఒక వ్యాపారి రైలు వెనుక పరుగులు తీశాడు.
ఆ ఘటనలో ప్రయాణికుడు మరియు వ్యాపారి వ్యవహరించిన తీరు, కష్టపడి పనిచేసే తత్వాన్ని మరియు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను అద్దం పడుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో, రైలు నెమ్మదిగా ప్లాట్‌ఫాం నుండి కదలడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో చేతిలో వడ పావ్ ఆర్డర్‌తో ఉన్న వ్యాపారి, రైలు వెనుక ఉరుకుతాడు. రైలు వేగం అందుకోసాగినా, దాని గేటు వద్ద నిలబడి ఉన్న ప్రయాణికుడికి వడ పావ్ అందిస్తాడు. తన వ్యాపారం కోసం ఆయన పడిన తపన చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది.
వడ పావ్ అందించిన తర్వాత, దానికి సంబంధించిన డబ్బును ఆన్‌లైన్‌లో పంపమని ప్రయాణికుడు చెబుతాడు. వెంటనే ఆ వ్యాపారి తన జేబులో నుంచి క్యూఆర్ కోడ్ (QR Code) తీసి అతనికి చూపిస్తాడు. కానీ అంతలోపే రైలు ప్లాట్‌ఫాం దాటి ముందుకు వెళ్లిపోతుంది. దీంతో డబ్బులు రాకుండా పోతాయేమో అనే భావన కలిగేలా ఆ దృశ్యం ఉంటుంది. అయితే, ఆ తర్వాత జరిగిన ఘటనే అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
కదులుతున్న రైలులోనే ఉన్న ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్ తీసుకుని, ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వడ పావ్‌కు సంబంధించిన రూ. 30 ఆన్‌లైన్‌లో చెల్లిస్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @tanishq__vaidya అనే ఖాతా షేర్ చేసింది. వార్త వెలువడే సమయానికి, ఈ వీడియో 5 కోట్లకు పైగా వ్యూస్‌ను మరియు 26 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నట్లు సమాచారం. వ్యాపారి పడిన కష్టాన్ని, ఆయన్ను మోసం చేయకుండా డబ్బు చెల్లించిన ప్రయాణికుడి నిజాయితీని నెటిజన్లు తెగ కొనియాడుతున్నారు.

Leave a Reply