ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లా మిశ్రోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో, తన అక్రమ సంబంధాన్ని దాచేందుకు కన్నతల్లే 13 ఏళ్ల కుమార్తెపై కిరాతక అఘాయిత్యానికి సహకరించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ గ్రామానికి చెందిన జైరామ్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం ముంబైలో పనిచేస్తుండగా, అతని భార్య మరియు 13 ఏళ్ల కుమార్తె గ్రామంలో నివసిస్తున్నారు.
గత జూన్ 26 సాయంత్రం, తల్లి తన కుమార్తెను ఏదో వస్తువు తెమ్మని దుకాణానికి పంపించింది. కూతురు బయటకు వెళ్లిన సమయంలో తన ప్రియుడు తసవ్వూర్ను ఇంటికి పిలిపించుకుంది.
అయితే దుకాణం నుంచి అనూహ్యంగా త్వరగా ఇంటికి వచ్చిన బాలిక, తల్లి మరియు ఆమె ప్రియుడు అసభ్యకరమైన స్థితిలో ఏకాంతంగా ఉండటాన్ని చూసి షాక్కు గురైంది. ఈ విషయాన్ని ముంబైలో ఉన్న తన తండ్రికి చెబుతానని బాలిక హెచ్చరించింది.
తమ గుట్టు రట్టవుతుందన్న భయంతో ఆ తల్లి బాలికను తీవ్రంగా బెదిరించింది. అంతటితో ఆగకుండా, “నేను లొంగిపోయినట్లే ఈమెనూ లొంగదీసుకో, అప్పుడే నోరు మూస్తుంది” అంటూ తన ప్రియుడిని రెచ్చగొట్టి కన్నకూతురిపై లైంగిక దాడి చేయించింది. ఈ దారుణానికి తల్లి కూడా పూర్తిగా సహకరించింది. అనంతరం తల్లి తన ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది.
జరిగిన దారుణాన్ని బాధితురాలు ముంబైలో ఉన్న తండ్రికి ఫోన్ చేసి కన్నీళ్లతో వివరించింది. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న తండ్రి పోలీసులను ఆశ్రయించినప్పటికీ ప్రారంభంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.
దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు మిశ్రోలియా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు పోక్సో (POCSO) చట్టం కింద తల్లి, ఆమె ప్రియుడు తసవ్వూర్ పై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
