కన్నీరుమున్నీరవుతున్న ట్రంప్.. 175 బిలియన్ డాలర్ల రీఫండ్.. భారత్‌కు ఎంత దక్కుతుంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన ‘రెసిప్రోకల్ టారిఫ్’ ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6-3 మెజారిటీతో ఈ చారిత్రక తీర్పును వెలువరించింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ తన పరిధిని మించి పన్నులు విధించారని కోర్టు స్పష్టం చేసింది.

175 బిలియన్ డాలర్ల రీఫండ్ గండం: ఈ తీర్పు కారణంగా, ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు వసూలు చేసిన సుమారు 175 బిలియన్ డాలర్ల (సుమారు ₹14.5 లక్షల కోట్లు) పన్ను మొత్తాన్ని ప్రపంచ దేశాలకు తిరిగి చెల్లించాల్సి రావచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు 11,000 వస్తువులపై, 233 దేశాల నుండి ఈ పన్నును వసూలు చేశారు. ఈ మొత్తం అమెరికా రవాణా మరియు న్యాయ శాఖల వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువ.

భారత్‌కు ఎంత దక్కుతుంది?: రీఫండ్ మొత్తానికి సంబంధించి దేశాల వారీగా పూర్తి వివరాలను అమెరికా ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే, భారత ఎగుమతిదారులు (ముఖ్యంగా టెక్స్టైల్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, కెమికల్స్ రంగాలకు చెందిన వారు) ఈ పన్ను వల్ల భారీగా నష్టపోయారు. ఇప్పుడు ఆ పన్ను రద్దు కావడంతో భారత ఎగుమతులకు విదేశీ మార్కెట్లో మళ్లీ డిమాండ్ పెరగనుంది. ముఖ్యంగా తిరుప్పూర్ వంటి టెక్స్టైల్ హబ్‌లకు ఇది పెద్ద ఊరట.

కోర్టు తీర్పు సారాంశం: అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కేవలం ‘కాంగ్రెస్’ (పార్లమెంట్) కు మాత్రమే ఉంది. యుద్ధం లేదా దేశ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు మాత్రమే అత్యవసర అధికారాలను వాడాలి. కానీ, అమెరికా ప్రపంచ దేశాలన్నింటితో యుద్ధంలో లేదు కాబట్టి, ట్రంప్ వ్యక్తిగతంగా ఈ పన్నులు విధించడం చెల్లదని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు.


Posted

in

by

Tags: