హోటల్ అంటే కాంక్రీట్ భవనం, గదులు, పడకలు వంటి సాధారణ నిర్మాణమే గుర్తుకు వస్తుంది. కానీ స్వీడన్లో ఉన్న ఒక హోటల్ దీనికి పూర్తిగా భిన్నమైనది.
సుమారు 6 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మంచు గడ్డలతో తయారు చేయబడిన ఈ హోటల్, ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద ‘ఐస్ హోటల్’గా పేర్కొనబడుతోంది.
ఉత్తర స్వీడన్‌లోని జుక్కాస్‌జార్వి అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ హోటల్, ఆర్కిటిక్ వలయానికి ఉత్తరాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలో ప్రవహించే తోర్న్ నది నుండి లభించే మంచు గడ్డలనే దీని నిర్మాణానికి ఉపయోగిస్తారు. హోటల్ లోపల ఉష్ణోగ్రత సుమారు మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌గా నిర్వహిస్తారు. అతిథులకు తీవ్రమైన చలిని తట్టుకునే ప్రత్యేక దుస్తులను కూడా అందిస్తారు.
మంచుతో నిర్మించబడినప్పటికీ, ఇది కేవలం బస చేసే ప్రదేశం మాత్రమే కాదు. బృహత్తరమైన ఆర్ట్ హాల్, ఐస్ గ్యాలరీ, డీలక్స్ గదులు, ఐస్ చర్చీ సహా పలు నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే కళాకారులు మంచు గడ్డలను చెక్కి, ప్రతి సంవత్సరం హోటల్ లోపలి భాగాన్ని కొత్త రూపంలో తీర్చిదిద్దుతారు. దీనివల్ల ప్రతి సంవత్సరం హోటల్ రూపురేఖలు విభిన్నంగా మారతాయి.
ఈ హోటల్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, అది శాశ్వతంగా ఒకే రూపంలో ఉండకపోవడమే. శీతాకాలంలో నిర్మాణ పనులు ప్రారంభమై జనవరిలో హోటల్ కొత్త రూపంలో సిద్ధమవుతుంది. వసంతకాలం రాగానే మంచు కరిగి మళ్లీ తోర్న్ నదిలో కలిసిపోతుంది. ఆ తర్వాత మరుసటి శీతాకాలంలో అదే ప్రాంతంలో కొత్త రూపంలో ఐస్ హోటల్‌ను నిర్మిస్తారు. ఇప్పటివరకు 10 లక్షల కంటే ఎక్కువ మంది ఇక్కడకి వచ్చి బస చేసినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.

Leave a Reply