మహారాష్ట్రలోని సతారా తాలూకా శివతర్ సమీపంలో ఉన్న నహ్లేవాడి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇంటి ముందు ఆడుకుంటున్న జైసందీప్ కందకాలే అనే రెండేళ్ల పసికందును ఓ చిరుతపులి అకస్మాత్తుగా ఎత్తుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో అకస్మాత్తుగా కరెంటు పోవడంతో ఏర్పడిన కారుచీకటిని ఆసరాగా చేసుకున్న ఆ క్రూర జంతువు, ఇంటి ఆవరణలో ఉన్న చిన్నారిని నోటకరుచుకుని సమీపంలోని చెరకు తోటలోకి పారిపోయింది.
చిన్నారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే కర్రలు పట్టుకుని వెంబడించినప్పటికీ, దట్టమైన చెరకు తోట, కారు చీకటి కారణంగా పిల్లాడిని వెంటనే కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత నేలపై పడిన రక్తపు మరకల ఆధారంగా గాలించగా.. గ్రామానికి సమీపంలోని ఓ కాలువ దగ్గర చిన్నారి మృతదేహం ఛిద్రమైన స్థితిలో దొరికింది. ఈ ఘటనతో ఆ గ్రామమంతా తీవ్ర విషాదంలో, దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.
తమ ప్రాంతంలో తరచుగా సంచరిస్తున్న చిరుతపులి గురించి అటవీశాఖ అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ నరభక్షక చిరుతను బోను పెట్టి పట్టుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి కారణమని ఆరోపిస్తూ ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన చేసే వాతావరణం నెలకొంది.

Leave a Reply