కోవిడ్ మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోయిన బ్రయాన్ స్క్వార్ట్జ్ (Brian Schwartz) అనే వ్యక్తి, వృద్ధులకు ‘ఉచితంగా’ లాన్ (గడ్డి) శుభ్రం చేసివ్వడం ప్రారంభించి, నేడు అమెరికా అంతటా ఒక పెద్ద నెట్‌వర్క్‌గా ఎదిగి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.
న్యూజెర్సీకి చెందిన బ్రయాన్ కోవిడ్ సమయంలో తన డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అతను, తన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, పక్కింట్లో ఉండే వృద్ధుడి తోటలోని గడ్డిని ఉచితంగా కోసి సహాయం చేశాడు.
ఆ చిన్న సహాయమే ‘ఐ వాంట్ టు మోవ్ యువర్ లాన్’ (I Want To Mow Your Lawn) అనే ఒక పెద్ద సేవా సంస్థగా మారింది. 6 ఏళ్ల క్రితం తన పొరుగున మొదలైన ఈ సేవ, నేడు అమెరికాలోని 50 రాష్ట్రాలకు విస్తరించి 2,000 మందికి పైగా వాలంటీర్లతో నడుస్తోంది.
ఈ సంస్థ ద్వారా 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మరియు ఆర్మీ జవాన్లకు ఉచితంగా గడ్డి కోయడం, రాలిన ఆకులను తొలగించడం, మంచును శుభ్రం చేయడం వంటి సేవలను అందిస్తున్నారు.
మొదట్లో సొంత డబ్బుతో పెట్రోల్ పోయించుకుని, తన సొంత యంత్రంతో మైళ్ల కొద్దీ ప్రయాణించి సేవ చేసిన బ్రయాన్ ప్రయత్నం, నేడు ఎంతో మంది వృద్ధులకు సహాయపడటమే కాకుండా, వారి ఒంటరితనాన్ని దూరం చేసే ఒక మంచి మార్గంగా మారింది.

Leave a Reply