‘కలలో వచ్చి భయపెడుతున్నాడు’, ప్రియుడితో ఉన్న తనను చూశాడని కన్నకొడుకునే చంపిన తల్లి; జీవితఖైదు విధించిన కోర్టు

మూడేళ్ల కొడుకు తనను తన ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో చూశాడన్న కోపంతో, ఒక తల్లి తన బిడ్డను రెండంతస్తుల భవనం పైనుంచి కిందకు తోసి హత్య చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 28, 2023న గ్వాలియర్ జిల్లాలోని థాటీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కొడుకు మరణం వెనుక ఉన్న అసలు నిజం మొదట ఎవరికీ తెలియలేదు. కానీ సదరు తల్లి వాంగ్మూలం ప్రకారం.. చనిపోయిన కొడుకు పదేపదే ఆమె కలలోకి వస్తూ నిజం ఒప్పుకొనేలా చేశాడు. దీంతో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ బిడ్డ తండ్రి, తన భార్యను నమ్మించి ఆమె మాటలను వీడియో తీసి సాక్ష్యాలను సేకరించి పోలీసులకు అందించారు. ఆ సాక్ష్యాల ఆధారంగా సెషన్స్ కోర్టు శనివారం నాడు ఆ తల్లికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.

అసలు ఏం జరిగింది? సాక్ష్యాధారాల లేమి కారణంగా ఆమె ప్రియుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నిందితురాలు జ్యోతి రాథోడ్ తన పొరుగున ఉండే ప్రియుడు ఉదయ్ ఇందోలియాతో కలిసి ఇంటి పైకప్పు (టెర్రస్) మీద ఉంది. ఆ సమయంలో ఆమె మూడేళ్ల కొడుకు సన్నీ అలియాస్ జతిన్ అక్కడికి వెళ్లాడు. తన తల్లి ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో జ్యోతి తన కొడుకును పైనుంచి కిందకు తోసేసింది.

ప్రమాదం అని నమ్మిన తండ్రి: పైనుంచి పడటంతో బాలుడి తలకి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజే ఆ చిన్నారి మరణించాడు. తండ్రి ధ్యాన్ సింగ్ (పోలీస్ కానిస్టేబుల్) మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని భావించాడు.

నేరాన్ని అంగీకరించిన తల్లి: కొడుకు చనిపోయిన తర్వాత జ్యోతి మానసిక స్థితి దెబ్బతింది. రాత్రిపూట భయంతో నిద్రలేవడం, బిక్కుబిక్కుమంటూ గడపడం చేసేది. కొడుకు మరణించిన బాధలో ఆమె అలా చేస్తోందని భర్త అనుకున్నాడు. కానీ, చనిపోయిన కొడుకు కలలో కనిపిస్తున్నాడని, తన ఆత్మ తిరుగుతోందని భయపడుతూ ఒకరోజు ఆమె అసలు నిజాన్ని భర్త ముందు ఒప్పుకుంది. తాము కలిసి ఉండగా బాబు చూశాడని, ఆ భయంతోనే కిందకు తోసేశానని చెప్పింది.


Posted

in

by

Tags: