కళ్యాణ మండపంలో ‘తాగుబోతు’ వరుడికి ‘టాటా-బై బై’ చెప్పిన వధువు.. 16 రోజుల తర్వాత అదే సంత్ కుమార్‌ను పెళ్లాడిన ముస్కాన్!

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపాలో వివాహ మండపంలో వరుడిని తాగుబోతు అని తిరస్కరించిన వధువు ముస్కాన్, సరిగ్గా 16 రోజుల తర్వాత అదే వరుడు సంత్ కుమార్‌ను గుడిలో వివాహం చేసుకుంది. జూన్ 23న ఎంతో ధైర్యంతో, ఆత్మగౌరవంతో వరుడికి ముస్కాన్ ‘టాటా-బై బై’ చెప్పిన తీరు అనేక కుటుంబాలకు, యువతులకు స్ఫూర్తిగా నిలిచింది.

ముస్కాన్ కథ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. బారాత్‌ను వెనక్కి పంపడం తప్పును ఎదిరించడానికి ఒక ఉదాహరణగా నిలిచింది. కానీ ఇటీవల కౌన్సెలింగ్ సెంటర్ నుండి బయటకు వచ్చిన ముస్కాన్ నేరుగా గుడికి వెళ్లి, తాను తిరస్కరించిన వరుడినే పెళ్లి చేసుకుంది. ఇదంతా ఒక అపార్థం వల్ల జరిగిందని, ఇద్దరి అంగీకారంతో అపార్థాలను తొలగించుకుని పెళ్లి చేసుకున్నామని ముస్కాన్ చెబుతోంది.

కళ్యాణ మండపం నుంచే బారాత్‌ను వెనక్కి పంపిన వధువు
జీ న్యూస్ కథనం ప్రకారం, జూన్ 23న చంపా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసమంద గ్రామంలో సంత్ కుమార్ బారాత్‌తో వచ్చాడు. అయితే అతను పీకలదాకా మద్యం సేవించి ఉన్నాడన్న ఆరోపణలతో వధువు ముస్కాన్, కళ్యాణ మండపం నుంచే బారాత్‌ను వెనక్కి పంపేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కింది. స్థానిక పోలీసులు కూడా వధువు నిర్ణయాన్ని గౌరవించి ముస్కాన్‌కు కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలర్‌గా బాధ్యతలు అప్పగించారు. కానీ కథ అక్కడితో ముగియలేదు. పెళ్లి రద్దయినప్పటికీ వధూవరులిద్దరూ ఒకరికొకరు ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నారు. ఫోన్‌లో మాట్లాడుకుంటూ తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకున్నారు.

కౌన్సెలింగ్ తర్వాత అదృశ్యమైన ముస్కాన్
జూలై 9న ముస్కాన్ ఎప్పటిలాగే ఇంటి నుంచి కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటలకు తన విధులను ముగించుకున్న తర్వాత ఇంటికి చేరుకోకుండా, సంత్ కుమార్ గ్రామమైన ఖోఖ్రా చేరుకుంది. అక్కడి మంకా దాయి ఆలయంలో వరుడి కుటుంబం ముందుగానే ఎదురుచూస్తోంది. హిందూ ఆచారాల ప్రకారం ఇద్దరూ ఏడు అడుగులు నడిచి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వరుడి కుటుంబానికి ఈ పెళ్లి గురించి ముందే తెలుసని, అమ్మాయి తరపు వారికి తర్వాత సమాచారం అందించారని వార్తలు చెబుతున్నాయి.

మరోవైపు ముస్కాన్ ఇంటికి రాకపోవడంతో, సాయంత్రం వరకు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, సైబర్ టీమ్ ముస్కాన్ లొకేషన్‌ను ట్రేస్ చేయగా.. ఆమె ఖోఖ్రా గ్రామంలోని సంత్ కుమార్ ఇంట్లో ఉన్నట్లు తేలింది. చంపా సీఎస్పీ యోగితా ఖప్డే పోలీసు బృందంతో కలిసి సంత్ కుమార్ ఇంటికి వెళ్లినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకున్నామని, ఇకపై కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని పోలీసులకు తెలిపారు. తమ పెళ్లి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: