బీహార్ రాష్ట్రం ముంగేర్ (Munger) జిల్లాలో, ప్రేమ వ్యవహారాలతో వరుసగా ఇల్లు వదిలి పారిపోయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఆ రాష్ట్రంలో పెద్ద సామాజిక చర్చకు దారితీశాయి.
ఒకే జిల్లాలోని మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధికి చెందిన ముగ్గురు యువతులు, తమ ప్రియుళ్లతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. అంతేకాకుండా, తమ కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు తమను గానీ, తమ భర్తలు, అత్తింటి వారిని గానీ ఇబ్బంది పెట్టవద్దని ఆ వీడియోలలో వారు కోరారు.
ముంగేర్ నగరంలోని బరియార్పూర్ విజయనగర్ ప్రాంతానికి చెందిన ప్రీతి కుమారి, నగర్ ప్రాంతానికి చెందిన శివాని కుమారి, హేమరాజ్పూర్ ప్రాంతానికి చెందిన మధు కుమారి.. ఈ ముగ్గురూ తమ సొంత ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వారు విడుదల చేసిన వీడియో సందేశాల్లో, ఎవరి ఒత్తిడి లేకుండా తమకు తాముగా ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశారు. అలాగే, తల్లిదండ్రులు తమను వెతుక్కుంటూ తిరగొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ వరుస ఘటనలు ఆ ప్రాంతంలోని తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన, చర్చను రేకెత్తించాయి. తొందరపడి, భావోద్వేగంతో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు యువత భవిష్యత్తు, ఉపాధి, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనల్లో ఉన్న యువతుల అసలు వయస్సు ఎంత, వారు చట్టబద్ధంగా మేజర్లేనా, ఈ వివాహాలు వారి సొంత ఇష్టంతోనే జరిగాయా లేదా అనే అంశాలపై పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.
న్యాయ, సామాజిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి వ్యవహారాల్లో యువతులు మైనర్లు అయితే అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి చట్టపరమైన నిబంధనలు, వయోపరిమితిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, యువత భావోద్వేగాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నివారించడానికి, సామాజిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్వేచ్ఛాయుతమైన (ఓపెన్) కమ్యూనికేషన్ ఎంతో అవసరమని వారు సూచిస్తున్నారు.
