మనిషి జీవితంలో మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో తన క్రూరమైన చేతులు చాచి వినాశనాన్ని తీసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు అనడానికి నిదర్శనంగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా వెస్ట్ ప్రాంతంలో ఒక హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది.
ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఓ ప్రముఖ ఆలయానికి బయలుదేరడానికి కొన్ని గంటల ముందు, ఇంట్లో దేవుడికి పూజ చేసేందుకు పూలు కోసేందుకు వెళ్లిన తండ్రి, అతని 11 ఏళ్ల కుమారుడు 23వ అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్మెంట్ వాసులందరినీ ఉలిక్కిపడేలా చేసిన ఈ విషాద ఘటన, ఆ ప్రాంతం మొత్తాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ప్రముఖ ‘మహాగన్ మైవుడ్స్’ అపార్ట్మెంట్ 23వ అంతస్తులోని ఫ్లాట్‌లో 40 ఏళ్ల రణదీప్ బాత్రా నివాసం ఉంటున్నాడు. ఆయన తన 11 ఏళ్ల కుమారుడు ఆరవ్, కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్లేందుకు యాత్ర ప్లాన్ చేసుకున్నారు.
ప్రయాణం ప్రారంభించే ముందు, రోజూలాగే ఇంట్లో పూజ చేసి బయలుదేరాలన్న ఉద్దేశ్యంతో, రణదీప్, అతని కొడుకు ఆరవ్ తమ ఇంటి 23వ అంతస్తు బాల్కనీకి వెళ్లి మొక్కల నుంచి పూలు కోయడం ప్రారంభించారు. అప్పటికే ఆ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా బాల్కనీ నేల చాలా జారుడుగా (స్లిప్పరీగా) ఉంది.
ఆ సమయంలో, ఊహించని విధంగా బాలుడు ఆరవ్ కాలు ఆ జారుడు నేలపై జారిపోవడంతో, అతడు బాల్కనీ గ్రిల్స్ దాటి ప్రమాదకరంగా గాల్లోకి వేలాడాడు. ఇది చూసి భయంతో వణికిపోయిన తండ్రి రణదీప్, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ముందుకు దూకి అతని చేతిని పట్టుకున్నాడు.
కానీ, దురదృష్టవశాత్తూ ఆయన కూడా తన శరీర సమతుల్యతను కోల్పోయి తూలిపోవడంతో, కొడుకును రక్షించడానికి ప్రయత్నించిన తండ్రి, తండ్రి పట్టులో ఉన్న కొడుకు.. ఇద్దరూ ఒకేసారి 23వ అంతస్తు పైనుంచి భయంకరంగా కింద పడిపోయారు.
భారీ శబ్దంతో కిందపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై బిస్రఖ్ (Bisrakh) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
