కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ చట్టం రద్దు.. రాహుల్ గాంధీ సంచలన ప్రకటన!

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోని సిఏపిఎఫ్ (CAPF – సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్) జవాన్ల గురించి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ఉదాహరణను ప్రస్తావిస్తూ ఎక్స్ (X) ద్వారా ఆయన తన గళాన్ని వినిపించారు.

“అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐఈడి (IED) పేలుడు కారణంగా తన ఒక కాలును కోల్పోయారు. దేశ రక్షణ కోసం సర్వస్వం పణంగా పెట్టిన ఆయనకు ఆ త్యాగానికి బదులుగా దక్కిందేమిటి? 15 ఏళ్లకు పైగా నిబద్ధతతో సేవ చేసినప్పటికీ ప్రమోషన్ లేదు, తన స్వంత దళాన్ని నడిపించే (లీడ్ చేసే) అధికారం లేదు. ఎందుకంటే అగ్రశ్రేణి పదవులన్నీ ఐపీఎస్ అధికారుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇది కేవలం ఒక అధికారి వేదన మాత్రమే కాదు – లక్షలాది మంది సిఏపిఎఫ్ జవాన్లకు జరుగుతున్న వ్యవస్థీకృత అన్యాయం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో ఇంకా మాట్లాడుతూ.. ఈ జవాన్లు సరిహద్దుల్లో కాపలా ఉంటారని, ఉగ్రవాదం మరియు నక్సలిజంతో పోరాడుతారని, ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికలను సురక్షితంగా నిర్వహిస్తారని తెలిపారు. కానీ వారి హక్కులు మరియు గౌరవం విషయానికి వస్తే వ్యవస్థ ముఖం చాటేస్తోందని విమర్శించారు.

సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవస్థను ప్రశ్నించింది
ఈ వివక్షకు వ్యతిరేకంగా స్వయంగా సిఏపిఎఫ్ జవాన్లే పోరాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. సుప్రీంకోర్టు సైతం ఈ విధానంపై ప్రశ్నలు లేవనెత్తిందని ఆయన గుర్తు చేశారు. “అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ అన్యాయాన్ని చట్టపరంగా శాశ్వతం చేయడానికి మొండిగా వ్యవహరిస్తోంది. ఈ బిల్లు కేవలం ఒకరి కెరీర్‌ను అడ్డుకునే ప్రయత్నం మాత్రమే కాదు – దేశ రక్షణలో ముందు వరుసలో ఉండే వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం. వారి మనోధైర్యం దెబ్బతింటే జాతీయ భద్రత పునాదులు కదులుతాయి” అని ఆయన హెచ్చరించారు.

మేము మాటల్లో కాదు, విధానాల్లో గౌరవిస్తాం: రాహుల్
“మేము సిఏపిఎఫ్ జవాన్లను కేవలం మాటల్లోనే కాదు, మా విధానాల్లో కూడా గౌరవిస్తాం. కాంగ్రెస్ స్పష్టమైన వాగ్దానం చేస్తోంది – మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వివక్షాపూరితమైన చట్టం రద్దవుతుంది. దేశం కోసం పోరాడే వారికి నాయకత్వం వహించే హక్కు ఖచ్చితంగా ఉండాలి” అని రాహుల్ గాంధీ ప్రకటించారు.


Posted

in

by

Tags: