“కాపాడండి అంటూ అరిచినా వదల్లేదు..!” నదిలో తలలను అదిమిపెట్టిన ఘోరం.. భూ వివాదానికి నీటిలో 12 నిమిషాలు ఊపిరి బిగబట్టే పోటీనా..? ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఫిలిప్పీన్స్ సంప్రదాయం..!!

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో చాలా కాలంగా నడుస్తున్న భూ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి నిర్వహించిన విచిత్రమైన నీటి అడుగున శ్వాస బిగబట్టే పోటీ, చివరకు ఇద్దరు రైతుల విషాద మరణానికి దారితీసింది.

సారంగని ప్రావిన్స్‌లోని అలబెల్ పట్టణ పరిధిలో గల కలమాంగ్ నదిలో అక్టోబర్ 16న ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 69 ఏళ్ల టోనీ మన్సాక్, 49 ఏళ్ల కాస్పర్ పలసానోన్ అనే ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు.

అక్కడ ఆచారంగా వస్తున్న ‘సోలేవే’ (Solewe) అనే సంప్రదాయం ప్రకారం, భూ యాజమాన్య హక్కుల వివాదంలో ఎవరు ఎక్కువ సమయం పాటు నీటి అడుగున ఊపిరి బిగబట్టి నిలబడతారో వారికే విజయం దక్కుతుందని నిర్ణయించి ఈ పోటీని ఏర్పాటు చేశారు.

సుమారు 12 నిమిషాల పాటు నీటి అడుగున ఉన్న ఆ ఇద్దరికీ తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బంది తలెత్తింది. ఆ సమయంలో ప్రాణాలు కాపాడాలంటూ వారు గిలగిలా కొట్టుకుంటూ అరిచినప్పటికీ, ఒడ్డున ఉన్న కొందరు వారి తలలను బలవంతంగా నీటిలోనే అదిమిపెట్టినట్లు దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

తీవ్ర అపస్మారక స్థితిలో బయటకు తీసిన ఆ ఇద్దరిలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో దృశ్యాల ఆధారంగా ఫిలిప్పీన్స్ పోలీసులు ప్రస్తుతం తీవ్ర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *