కారులో ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించకండి; ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ విషయాలు గమనించండి!

కారు లేదా ఇతర వాహనాల్లో పెట్రోల్ నింపేటప్పుడు “ఆటో కట్ (Auto Cut) వరకు చాలా?” అని పెట్రోల్ బంక్ సిబ్బంది అడుగుతుంటారు. కొందరు వాహన యజమానులు ఆటో కట్ అయిన తర్వాత కూడా ట్యాంక్ అంచు వరకు ఇంధనం నింపమని చెబుతుంటారు. ట్యాంక్ నిండి బయటకు వచ్చే వరకు పోయిస్తేనే వారికి తృప్తిగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే, వెంటనే దానిని మానుకోండి. ఎందుకంటే ఇది మీ వాహనానికి మరియు మీకు కూడా ప్రమాదకరం.

వాహన తయారీదారులు ప్రతి వాహనానికి నిర్దేశించిన సామర్థ్యం (Tank Capacity) మేరకే ఇంధనం నింపాలని సూచిస్తారు. ఇంజిన్ మరియు ఇతర భాగాలు సజావుగా పనిచేయడానికి ఇది చాలా ముఖ్యం. చాలా కార్లలో ట్యాంక్ సామర్థ్యం కంటే మరో ఆరు, ఏడు లీటర్ల ఇంధనం అదనంగా పట్టే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.

నష్టం ఏమిటి? పెట్రోల్ వాహనాల్లో ‘ఇవాపరేటివ్ ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్’ (Evaporative Emission Control System) అనే ఒక వ్యవస్థ ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ లోపల తయారయ్యే పెట్రోల్ ఆవిరి బయటకు పోకుండా నియంత్రించడం దీని ప్రధాన పని. ఈ ఆవిరిని ఒక ‘చార్‌కోల్ కానిస్టర్’ (Charcoal Canister) లో సేకరిస్తారు. వాహనం నడుస్తున్నప్పుడు ఈ ఆవిరిని ఇంజిన్‌లోకి పంపి అక్కడ మండించడం జరుగుతుంది. దీనివల్ల వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధనం వృధా కాకుండా ఉంటుంది.

పెట్రోల్ బంక్ వద్ద ‘ఆటో కట్’ అవ్వడమే ట్యాంక్ సురక్షిత పరిమితి వరకు నిండిందని సంకేతం. ఆ తర్వాత కూడా బలవంతంగా పెట్రోల్ నింపినప్పుడు, ఆ ఇంధనం ఆవిరి వెళ్లాల్సిన పైపుల్లోకి ప్రవహిస్తుంది. దీనివల్ల ఆవిరిని సేకరించే చార్‌కోల్ కానిస్టర్ తడిచిపోయి, క్రమంగా పాడైపోతుంది. దీనితో పాటు సెన్సార్లు, వాల్వ్‌లు కూడా దెబ్బతింటాయి. మీ కారు డ్యాష్‌బోర్డ్‌లో ‘చెక్ ఇంజిన్ లైట్’ (Check Engine Light) వెలిగినా లేదా కారు లోపల, బయట పెట్రోల్ వాసన వస్తున్నా, మీ కారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుందని అర్థం. దీనిని రిపేర్ చేయించాలంటే మీ జేబుకు భారీ చిల్లు పడక తప్పదు.


Posted

in

by

Tags: