ఉత్తరప్రదేశ్లో అదనపు కట్నంగా కారు ఇవ్వాలని కోరుతూ వివాహితను భర్త, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
పెళ్లైన కేవలం రెండు నెలలకే ఈ వేధింపులు మొదలయ్యాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వివాహ సమయంలో దాదాపు రూ.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు అందజేసినప్పటికీ.. మరింత కట్నం కింద కారు కావాలంటూ అత్తింటివారు వేధించసాగారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 15న వివాదం మరింత ముదిరింది. కారు కొనివ్వలేదన్న కోపంతో తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించారని.. అనంతరం భర్త మూడుసార్లు “తలాక్” చెప్పి ఇంటి నుంచి గెంటేసి పుట్టింటి వద్ద వదిలిపెట్టాడని బాధితురాలు వాపోయింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, కారు విషయంలో అత్తింటివారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పట్టుబట్టినట్లు తెలిసింది.
దీంతో బాధితురాలు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త షారిక్ సైఫీ, మామ నయీమ్ అక్తర్, అత్త షమీమ్ బానో, ఆడపడుచు షైస్తా, ఆమె భర్త ఆసిఫ్ సైఫీలతో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహమైన రెండు నెలలకే అదనపు కట్నం కారు కోసం వేధించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Leave a Reply