గుజరాత్‌లోని మోర్బీ నగరంలో కారు సెన్సార్ నుంచి తరచూ శబ్దం వస్తోందన్న కారణంతో ఓ వ్యక్తి తన పక్కింట్లో నివసించే మహిళా న్యాయవాది కారుకు నిప్పంటించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, కారు మంటల్లో కాలిపోతుండగా తన సెల్ఫోన్లో వీడియో కూడా చిత్రీకరించినట్లు సమాచారం.
మోర్బీలోని వాఘ్పరా ప్రాంతంలో అక్టోబర్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. న్యాయవాది పుష్పా భట్‌కు చెందిన మారుతి సుజుకి స్విఫ్ట్ కారును ఆమె ఇంటి సమీపంలో పార్క్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన షికర్ గోహెల్ అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో కారు వద్దకు చేరుకుని, వాహనం ముందు భాగంలో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొద్దిసేపటికే మంటలు కారు ముందు భాగం నుంచి వాహనం మొత్తం వ్యాపించాయి. అయినప్పటికీ అక్కడి నుంచి వెళ్లిపోకుండా, కారు కాలిపోతున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన వ్యక్తి కారుపై ఇంధనం పోసి నిప్పంటించడం, ఆ తర్వాత మంటలను ఫోన్లో చిత్రీకరించడం అందులో నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారుకు సుమారు రూ.3.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
పుష్పా భట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోర్బీ ఏ డివిజన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కారు సెన్సార్ నుంచి తరచూ శబ్దం రావడంతో చిరాకు పడి ఈ చర్యకు పాల్పడినట్లు షికర్ గోహెల్ చెప్పినట్లు కథనంలో పేర్కొన్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.
కేవలం కారు నుంచి శబ్దం వస్తోందన్న కారణంతో పక్కింటి మహిళ వాహనానికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
