బెంగళూరులో గత 7 నెలల క్రితం అదృశ్యమైన 18 ఏళ్ల కళాశాల విద్యార్థినిని కర్ణాటక రాష్ట్ర సీఐడీ (CID) పోలీసులు విజయవంతంగా గుర్తించి రక్షించారు.
ఈ కేసులో విద్యార్థిని ఆచూకీ కనుగొనడంలో ఆమె ఉపయోగించిన ఆధార్ ఓటీపీ (OTP) అత్యంత కీలకమైన ఆధారంగా మారిందని అధికారులు వెల్లడించారు.
గత జనవరి నెలలో బెంగళూరు విద్యారణ్యపురానికి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థిని, తన స్నేహితురాలితో కలిసి కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆ సమయంలో వారిద్దరూ తమ వెంట మొబైల్ ఫోన్లు గానీ, ఇతర వస్తువులు గానీ తీసుకెళ్లలేదు; కేవలం కళాశాల బ్యాగులు, తమ వ్యక్తిగత గుర్తింపు కార్డులను మాత్రమే తీసుకెళ్లారు.
కాలేజీకి వెళ్లిన విద్యార్థిని ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు గత ఏప్రిల్ నెలలో ఈ కేసు దర్యాప్తును సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. పోలీసులు నెలల తరబడి తీవ్రంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఈ క్రమంలో ఈ వారం ప్రారంభంలో పోలీసులకు ఓ కీలక ఆధారం చిక్కింది. ఆ విద్యార్థిని తన గుర్తింపు కార్డు వివరాలను అప్డేట్ చేయడానికో లేదా ఏదైనా సేవ కోసమో ఉపయోగించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆ ప్రక్రియలో ఓటీపీ పొందడం కోసం ఆమె తన భర్త మొబైల్ నంబర్ను ఉపయోగించింది.
ఓటీపీ వచ్చిన ఆ మొబైల్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీంతో కనకపుర తాలూకాలోని ఓ మారుమూల గ్రామంలో ఆమె నివసిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కలిసి జీవిస్తున్న ఆ విద్యార్థినిని సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆమెను హైకోర్టులో హాజరుపరిచి, తల్లిదండ్రులకు అప్పగించారు.
మరోవైపు, ఆ విద్యార్థినితో కలిసి మొదట్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె స్నేహితురాలి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో.. ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
