మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. కాలేయ పనితీరులో లోపాలు తలెత్తినప్పుడు, శరీరం కొన్ని సంకేతాలను చూపించడం ప్రారంభిస్తుంది. వీటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
కాలేయ వ్యాధి ప్రధాన లక్షణాలు:
- జ్వరం మరియు పచ్చకామెర్లు: చర్మం మరియు కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం కాలేయ వ్యాధికి ప్రధాన లక్షణం. దీనిని పచ్చకామెర్లు (Jaundice) అంటారు. రక్తంలోని ఎర్ర రక్తకణాలు నశించినప్పుడు విడుదలయ్యే ‘బిలిరుబిన్’ అనే పసుపు రంగు పదార్థాన్ని కాలేయం శుద్ధి చేయలేనప్పుడు ఇలా జరుగుతుంది.
- మూత్రం మరియు మలంలో మార్పులు: మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, అలాగే మలం రంగు మారి తెల్లగా (మట్టి రంగులో) రావడం కూడా కాలేయ సమస్యకు సూచిక.
- వాపులు: పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం మరియు కాళ్లలో వాపులు (Edema) రావడం కాలేయ అనారోగ్యానికి సంకేతం కావచ్చు.
- తీవ్రమైన దురద: చర్మంపై విపరీతమైన దురద కలగడం కూడా ఒక లక్షణమే. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు, పిత్త లవణాలు (Bile salts) రక్తంలో చేరి చర్మం కింద పేరుకుపోవడం వల్ల ఈ దురద వస్తుంది.
- ఆకలి తగ్గడం: కాలేయం జీర్ణక్రియకు సహాయపడే పిత్త రసాన్ని (Bile) ఉత్పత్తి చేస్తుంది. కాలేయం దెబ్బతిన్నప్పుడు దీని ఉత్పత్తి తగ్గి, ఆకలి మందగిస్తుంది. దీనివల్ల వేగంగా బరువు తగ్గడం కూడా జరగవచ్చు.
- రక్తస్రావం మరియు గాయాలు: చిన్న చిన్న గాయాలైనా రక్తం త్వరగా గడ్డకట్టకపోవడం లేదా చర్మంపై నీలి మచ్చలు రావడం జరిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రొటీన్లను కాలేయం ఉత్పత్తి చేయలేకపోవడమే దీనికి కారణం.
- నీరసం మరియు వాంతులు: తరచుగా అలసటగా అనిపించడం, వాంతులు అవ్వడం కూడా కాలేయ ఆరోగ్యం క్షీణించడానికి సంకేతాలు.
గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.
