మోతీహారి: బీహార్లోని మోతీహారిలో ఒక తాగుబోతు వింత ఘాతుకానికి ఒడిగట్టాడు. మద్యం కొనడానికి డబ్బులు సరిపోకపోవడంతో, ఒక కుక్కను చంపి, దాని మాంసాన్ని ‘కుందేలు మాంసం’ అని నమ్మించి గ్రామస్తులకు విక్రయించాడు. అలా వచ్చిన డబ్బుతో మద్యం నియంత్రణలో ఉన్న బీహార్లో ఖరీదైన మద్యాన్ని కొనుగోలు చేసి సేవించాడు. ఆ మాంసం తిన్న పలువురు గ్రామస్తులు ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారు.
మద్యం కోసం కుక్క మాంసం విక్రయం: ఈ ఘటన మధుబన్ బ్లాక్ పరిధిలోని గరైయా గ్రామంలో జరిగింది. స్థానికంగా నివసించే మంగ్రూ సహనీ అనే యువకుడికి మద్యం తాగే అలవాటు ఉంది. సోమవారం అతనికి మద్యం తాగాలని అనిపించింది, కానీ జేబులో డబ్బులు లేవు. దీంతో ఒక కుక్కను పట్టుకుని చంపి, దాని మాంసాన్ని కుందేలు మాంసమని ఊరంతా ప్రచారం చేసి అమ్మాడు.
గ్రామస్తుల అస్వస్థత – బయటపడ్డ నిజం: బాధితుడు రామ్ పర్వేష్ సహనీ మాట్లాడుతూ- “సాయంత్రం సమయంలో మంగ్రూ వచ్చి ఇది కుందేలు మాంసం అని చెప్పాడు. నేను తినలేదు కానీ, నా భార్యాబిడ్డలు తిన్నారు. మరుసటి రోజు ఉదయం మంగ్రూ స్వయంగా వచ్చి.. తాను తినిపించింది కుందేలు మాంసం కాదు, కుక్క మాంసం అని చెప్పాడు. మొదట అతను జోక్ చేస్తున్నాడని అనుకున్నాం, కానీ వెతకగా మాకు కుక్క తల, కాళ్లు లభించాయి. అప్పుడు మాకు అసలు నిజం అర్థమైంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 10-15 మంది ఈ మాంసాన్ని తిన్నారని, వారిలో చాలామందికి వాంతులు అవ్వడంతో పాటు ఆరోగ్యం పాడైందని ఆయన తెలిపారు.
కిలో రూ. 1000 చొప్పున విక్రయం: గ్రామానికి చెందిన లక్ష్మీ దేవి అనే మహిళ మాట్లాడుతూ- “మంగ్రూ వచ్చి కుందేలు మాంసం తింటారా అని అడిగాడు. అతని మాటలు నమ్మి మాంసం తిన్నాను. తిన్న తర్వాత వాంతులు మొదలయ్యాయి. ఉదయం వచ్చి కుక్క మాంసం తినిపించానని చెప్పాడు” అని పేర్కొన్నారు. ఆ మాంసం కోసం ఆమె రూ. 500 చెల్లించినట్లు తెలిపారు. మరో బాధితుడు కూడా అర కిలో మాంసం కోసం రూ. 500 ఇచ్చానని చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు: ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుక్కను చంపగలిగిన వ్యక్తి మనుషులను కూడా చంపగలడని, అలాంటి వ్యక్తిని వెంటనే జైలుకు పంపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
