ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బాలోద్ జిల్లాలో, ఒక మహిళను ‘మంత్రగత్తె’ అని ముద్రవేసి బంధువులు వేధించారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
కుటుంబంలో జరిగిన మరణాలకు, వరుసగా ఎదురవుతున్న సమస్యలకు ఆ మహిళే కారణమని నిందిస్తూ, ఆమెను తీవ్రంగా అవమానించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, వివిధ ప్రాంతాల నుంచి తాంత్రికులను రప్పించి మాంత్రిక పూజలు (క్షుద్ర పూజలు) నిర్వహించి, వాటి పేరుతో కూడా ఆమెను వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధిత మహిళ కోర్టును ఆశ్రయించడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలోద్ పట్టణంలోని వార్డు నంబర్ 12లో ఉన్న గంజ్పారా ప్రాంతానికి చెందిన సరళా పటేల్ అనే మహిళ, తనను వేధించారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, వారితో సంబంధం ఉన్న మరో 15 మందిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొదట కుటుంబ సభ్యులే తనను హింసించారని, ఆ తర్వాత బయట నుంచి తాంత్రికులను తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేసి అవమానించారని ఆమె ఆరోపించారు. ఇరుగుపొరుగు వారు, బంధువుల సమక్షంలో కూడా తనను ‘మంత్రగత్తె’ అని పిలుస్తూ కించపరిచారని పిటిషన్లో పేర్కొన్నారు.
2020 నవంబర్‌లో సరళా పటేల్ ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో నాగ్‌పూర్‌కు చెందిన తాంత్రికుడు పండిట్ ఉమేష్ దవే అనే వ్యక్తిని పిలిపించారని, కుటుంబంలో జరిగిన మరణాలు, ఇతర సమస్యలకు సరళే కారణమని చెబుతూ పూజలు నిర్వహించారని ఫిర్యాదులో తెలిపారు. ఇందుకోసం సుమారు రూ. 50 వేలు ఖర్చు చేశారని ఆమె చెప్పారు. రుతుక్రమం (నెలసరి) కారణంగా తాను ఆ పూజలో పాల్గొననందుకు, తనను మంత్రగత్తెగా ముద్రవేసి అవమానించారని సరళ ఆరోపించారు.
ఆ తర్వాత ఆమె అత్త కాంతాబెన్ పటేల్ అనారోగ్యానికి గురైనప్పుడు కూడా, దానికి సరళనే బాధ్యురాలిని చేశారని సమాచారం. దీనికోసం జార్ఖండ్, ధన్‌బాద్ ప్రాంతాలకు చెందిన వారి సహాయంతో తాంత్రికులను సంప్రదించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, గుజరాత్ రాష్ట్రం వడోదరలోని ఒక తాంత్రికుడి వద్దకు సరళను తీసుకెళ్లి, రోజంతా నిమ్మకాయను చేతిలో పట్టుకునేలా చేసి, తప్పు చేసినందుకు క్షమాపణ చెప్పాలని బలవంతం చేశారని తెలిసింది. అందుకు ఆమె నిరాకరించడంతో, కొబ్బరికాయ చుట్టూ మంత్రాలు చదివారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
