ఉత్తరప్రదేశ్‌లో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వైద్యుడిని, ఆయన సోదరుడిని అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.
2018లో నమోదైన ఈ కేసులో దిగువ న్యాయస్థానం ఆ వైద్యుడికి గతంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన అప్పీల్‌ను విచారించిన న్యాయస్థానం, సమర్పించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించి ఇద్దరిపై మోపిన అభియోగాలను కొట్టివేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2018 మార్చిలో డాక్టర్ అయిన భార్య, తన 6 ఏళ్ల కుమార్తెపై భర్త లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హల్ద్వానీలో 10 రోజుల పాటు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణ చేపట్టిన దిగువ న్యాయస్థానం, ఆ వైద్యుడితో పాటు ఆయన సోదరుడికి కూడా శిక్ష విధించింది.
అయితే, భార్యాభర్తల మధ్య ఉన్న తీవ్ర కుటుంబ కలహాలు, విడాకుల వ్యవహారాలను కూడా హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఈ-మెయిళ్లు, ఫోటోలతో పాటు పలు ఆధారాలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే, చిన్నారి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. తల్లి ప్రభావం/ఒత్తిడి వల్లే బాలిక తప్పుడు వాంగ్మూలం ఇచ్చి ఉండవచ్చనే నిర్ధారణకు కోర్టు వచ్చింది.
ఆగస్టు 13న వెలువరించిన తీర్పులో, వీరిద్దరినీ అన్ని ఆరోపణల నుంచి నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో చిన్నారుల సాక్ష్యాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. డాక్టర్ సోదరుడిపై చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి కూడా తగిన ఆధారాలు లేవని తేల్చింది. జైలులో ఉన్న వైద్యుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించగా, ఆయన సోదరుడు ఇదివరకే బెయిల్‌పై ఉన్నట్లు తెలిసింది.
