వారణాసిలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా, ముస్లిం టోపీ ధరించిన ఓ వ్యక్తి బ్యాగులో కత్తి బయటపడటం అక్కడ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, సమగ్ర విచారణ నిమిత్తం దశాశ్వమేధ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల విచారణలో ఆ వ్యక్తి మొఘల్సరాయ్కు చెందిన షాహిద్ జమాల్గా తేలింది. అతడు ఎలాంటి కుట్రపూరిత ఉద్దేశంతో అక్కడికి రాలేదని ప్రాథమికంగా స్పష్టమైంది. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన అతడు, పలు శుభకార్యాల్లో కూరగాయలు తరిగే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని, పని వెతుక్కుంటూ వెళ్లే మార్గంలో తీవ్రమైన ఆకలి వేయడంతో అన్నపూర్ణ అన్నక్షేత్రంలో భోజనం చేసేందుకు వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు.
తాను రోజువారీ కూలీ పని కోసం తీసుకెళ్లే కూరగాయలు కోసే కత్తి బ్యాగులోనే ఉందన్న విషయాన్ని అతడు గమనించలేదని పోలీసుల పరిశీలనలో నిర్ధారణ అయింది. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా.. మానవతా దృక్పథంతో పోలీస్ స్టేషన్లోనే అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా అతడికి కడుపునిండా భోజనం పెట్టి అక్కడి నుంచి పంపించివేశారు.
