ఇటీవల మైసూరులోని కెనరా బ్యాంకులో కస్టమర్ల బంగారం విషయంలో మోసం జరిగిన వార్త మరువకముందే, బెంగళూరులో కూడా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో తాకట్టు పెట్టి విడిపించుకున్న బంగారు గొలుసు నకిలీది అని తేలడంతో ఒక దంపతులు లబోదిబోమంటున్నారు.
ఏం జరిగిందంటే? బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లోని ఎస్బీఐ (SBI) శాఖలో ముఖేష్, పూర్ణిమ అనే దంపతులు ఏడాది క్రితం తమ బంగారు గొలుసును తాకట్టు పెట్టి ₹2 లక్షల రుణం తీసుకున్నారు. ప్రతి నెలా ₹11,700 చొప్పున అసలు, వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. నిన్న పూర్తి డబ్బు కట్టి తమ బంగారు గొలుసును విడిపించుకున్నారు.
మళ్ళీ డబ్బు అవసరం పడటంతో ఆ గొలుసును తీసుకుని ఒక తాకట్టు దుకాణం (మార్వాడీ షాప్) వద్దకు వెళ్లారు. అక్కడ పరీక్షించగా అది నకిలీ బంగారం అని తేలింది. షాక్ తిన్న దంపతులు వెంటనే బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని నిలదీయగా, వారు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులు మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బస్సులో ₹22 లక్షల విలువైన బంగారం చోరీ: కిలాడీ లేడీ అరెస్ట్
మరో ఘటనలో, కేఎస్ఆర్టీసీ (KSRTC) బస్సులో ₹22 లక్షల విలువైన 240 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించిన మహిళను చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. చింతామణి తాలూకాకు చెందిన వనజాక్షి అనే మహిళ గుడికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంకు చెందిన మీనాక్షి అనే నిందితురాలు ఈ చోరీకి పాల్పడింది. పోలీసులు నిందితురాలిని పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్నారు.
