రియో డి జనీరో: బ్రెజిల్‌లోని రియో డి జనీరో సమీపంలో ఉన్న ‘పెడ్రా డో మాకాకో’ కొండపై ఒక హైకర్ ఫోటో కోసం పోజులిస్తూ 500 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల కైయో రోచా అగుయిర్ అరబాల్గా గుర్తించారు.
ఏం జరిగింది? కైయో తన స్నేహితులతో కలిసి కొండపైకి వెళ్లాడు. అతను రాతి అంచుపై నిలబడి ఫోటోలకు పోజులిస్తుండగా, అతని స్నేహితురాలు ఆ దృశ్యాన్ని వీడియో తీస్తోంది. కొద్దిసేపటికి అతను కొంచెం కిందకు దిగుతూ, రాతిని ఒక చేత్తో పట్టుకుని గాలిలో వేలాడుతున్నట్లు కనిపించాడు. అడుగు వేయడానికి సరైన ఆధారం దొరక్క, కిందికి దిగే ప్రయత్నంలో అతను పట్టుతప్పి కిందకు జారిపోయాడు. అతను పడిపోతున్న దృశ్యాన్ని చూసిన స్నేహితురాలు భయంతో గట్టిగా కేకలు వేసింది. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు, కైయో కెమెరా వైపు చూస్తూ సంతోషంగా ఊపుతూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెస్క్యూ ఆపరేషన్: అతను పడిపోయిన వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. నాలుగు గంటల పాటు శ్రమించి, హెలికాప్టర్ మరియు తాడుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. “ఆ ప్రాంతం దట్టమైన అడవితో నిండి ఉండటంతో అక్కడికి చేరుకోవడం చాలా కష్టతరమైంది. తాడుల సహాయంతో ఎక్కి, ఎన్నో ఇబ్బందులు పడి మృతదేహం ఉన్న చోటికి చేరుకున్నాం” అని మారిసా సివిల్ డిఫెన్స్ అధికారి మాథ్యూస్ మౌరా తెలిపారు. నివేదికల ప్రకారం, కైయో అక్కడ హైకర్లకు గైడ్‌గా వ్యవహరిస్తున్నాడు, కానీ అతనికి దానికి తగిన లైసెన్స్ లేదని సమాచారం.
