కేరళ తండ్రులను కదిలించిన కళ్యాణి ప్రియదర్శన్ ‘ఆంటోనీ’.. ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది!

మలయాళ చిత్రాలకు అన్ని భాషల్లోనూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ సినిమాలతో పాటు మలయాళంలో వచ్చే ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమాలు గుండెలను హత్తుకుంటాయి. అలాంటి సినిమాలను చూసిన తర్వాత ఆ ప్రభావం నుండి అంత త్వరగా బయటకు రాలేము. ఆ కోవలోకే వస్తుంది 2023లో విడుదలై కేరళ ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన కళ్యాణి ప్రియదర్శన్ చిత్రం ‘ఆంటోనీ’.

ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా (Aha) మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్, జోజూ జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కథేంటంటే?

సినిమా నాయిక కళ్యాణి ఒక బాక్సర్. కాలేజీలో బాక్సింగ్ ఛాంపియన్ అయిన ఆమె, తనను తప్పుగా మాట్లాడే వారిని చితకబాదుతుంది. ఒకరోజు కళ్యాణి తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. నిజానికి అతడిని జోజూ జార్జ్ హత్య చేస్తాడు. తన స్నేహితుడి కాలు నరికినందుకు ప్రతీకారంగా అతడిని చంపేస్తాడు. ఈ హత్యను కళ్యాణి తల్లి ప్రత్యక్షంగా చూస్తుంది.

దీనివల్ల జైలుకు వెళ్ళిన జోజూ జార్జ్, తగిన ఆధారాలు లేక బయటకు వస్తాడు. అయితే కళ్యాణి తల్లి సాక్ష్యం చెప్పకుండా ఉండటానికి ఒక సెటిల్మెంట్ అడుగుతాడు. తన భర్తను చంపిన వాడితో సెటిల్మెంట్ ఏంటి అని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అంతటి దుర్మార్గుడు. అతని వల్ల ఆ తల్లి, కూతురు ఎన్నో కష్టాలు పడ్డారు. అందుకే “నువ్వు చంపడం వల్లే ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం” అని ఆమె చెబుతుంది. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న జోజూ, ఒక ఇంటిని వారి పేరు మీద రాసిస్తాడు.

ఇలా సాగుతుండగా, ఒకరోజు కళ్యాణి తల్లి కూడా హత్యకు గురవుతుంది. దిక్కులేని స్థితిలో ఉన్న కళ్యాణిని చివరకు జోజూ జార్జ్ దత్తత తీసుకుంటాడు. ఆమెకు గార్డియన్‌గా ఉంటూ కాలేజీ ఫీజు కట్టడం, ఇతర అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తాడు.

అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. చనిపోయిన వ్యక్తి కళ్యాణి అసలు తండ్రి కాదు, ఆమె తల్లికి రెండో భర్త అని అందరికీ తెలుస్తుంది. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణి తన అసలు తండ్రిని చూడాలనుకుంటుంది. అదే సమయంలో జైలు నుండి చనిపోయిన వ్యక్తి సోదరుడు విడుదలవుతాడు. చివరకు కళ్యాణి తన అసలు తండ్రిని కలిసిందా? గార్డియన్‌గా ఉన్న జోజూ పరిస్థితి ఏంటి? అనేదే మిగిలిన కథ. క్లైమాక్స్ దృశ్యాలు ప్రతి ఒక్కరి కంటతడి పెట్టిస్తాయి.


Posted

in

by

Tags: