క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. గత పదేళ్లలో క్యాన్సర్ కేసుల్లో 54% పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా జీవనశైలి మార్పుల వల్ల చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ తరుణంలో క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చే ఒక గొప్ప వార్త బయటకు వచ్చింది. కేవలం ఐదు రోజుల్లోనే క్యాన్సర్‌ను మాయం చేయగల చికిత్సను పరిశోధకులు కనుగొన్నారు.
అత్యంత ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్ ‘గ్లియోబ్లాస్టోమా’ (Glioblastoma) చికిత్స కోసం CAR-T సెల్ థెరపీ అనే కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అమెరికాలోని మాస్ జనరల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు ముగ్గురు రోగులపై చేసిన ప్రయోగంలో అద్భుత ఫలితాలు వచ్చాయని ‘ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు. వీరు అభివృద్ధి చేసిన CARv3-TEAM-E T అనే మందును వాడిన కొద్ది రోజుల్లోనే క్యాన్సర్ కణాలు కుంచించుకుపోయాయి.
ఏమిటీ CAR-T థెరపీ? ఈ చికిత్సలో రోగి యొక్క రోగనిరోధక కణాలనే (Immune Cells) ఉపయోగిస్తారు. వీటిని TEAMs (T-cell engaging antibody molecules) అనే యాంటీబాడీలతో కలిపి మందుగా మారుస్తారు. దీనిని నేరుగా రోగి మెదడులోకి ఇంజెక్ట్ చేస్తారు. 57 నుండి 74 ఏళ్ల మధ్య వయసున్న రోగులపై ఈ ప్రయోగం చేశారు. వీరిలో ఒకరికి కేవలం 5 రోజుల్లోనే ట్యూమర్ అదృశ్యమైందని, తదుపరి పరీక్షల్లో వారు కోలుకున్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. మరొకరికి ఆరు నెలల్లో 60% వరకు ట్యూమర్ తగ్గిపోయింది.
అయితే, ఈ ఇంజెక్షన్ తర్వాత జ్వరం వంటి కొన్ని చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చని వైద్యులు తెలిపారు. ఈ చికిత్సపై మరిన్ని లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని, ఇది పూర్తిగా విజయవంతమైతే క్యాన్సర్ వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పు అవుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
