గత ఎన్నికల్లో డీఎంకే (DMK) మరియు వీసీకే (VCK) కూటమికి అతిపెద్ద బలంగా ఉన్న మైనారిటీల ఓటు బ్యాంక్, ఈసారి టీవీకే (తమిళగ వెట్రి కళగం) వైపు భారీగా బదిలీ అయిందని విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధ్యక్షుడు తిరుమావళవన్ బహిరంగంగా అంగీకరించారు.
దీని గురించి ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో కేవలం ‘విజయ్’ అని మాత్రమే పిలవబడే వ్యక్తి, రాజకీయాల్లోకి రాగానే ‘జోసెఫ్ విజయ్’ అని పక్కా ప్రణాళికతో బ్రాండింగ్ చేశారని, ఈ బ్రాండింగ్ మైనారిటీలలో భారీ ప్రభావాన్ని చూపి ఓట్ల మార్పిడికి దారితీసిందని తెలిపారు.
క్రైస్తవ ఓట్లలో దాదాపు 80% పూర్తిగా టీవీకే వైపు షిఫ్ట్ అయ్యాయని, ముస్లిం ఓట్లలో కేవలం 60-70% మాత్రమే తమ కూటమిలో మిగిలాయని, మిగిలిన ఓట్లు టీవీకే వైపు వెళ్లిపోయాయని తిరుమావళవన్ కుండబద్దలు కొట్టారు. ఎన్నికలకు ముందే బీజేపీ కూడా దీనిని అంచనా వేసిందని, అందుకే టీవీకే మైనారిటీ ఓట్లను చీలుస్తుందనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఊహించని ఓటు బ్యాంక్ విచ్ఛిన్నమే తమ కూటమి ఎదుర్కొన్న నష్టానికి ప్రధాన కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
