“కోట్లలో ఆస్తి ఉన్నా ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయలేకపోతున్నా..!” పాత నౌకరుతో కోడలి పన్నాగం.. ఇంట్లోనే శవమైన మామగారు.. ఏడుస్తూ నాటకమాడి చివరకు అడ్డంగా దొరికిపోయింది.. పార్టీ గ్యాప్‌లో ఏం జరిగింది?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్, కల్యాణ్‌పూర్ పరిధిలోని ఇందిరా నగర్‌కు చెందిన ‘రతన్ ఆర్బిట్’ అపార్ట్‌మెంట్‌లో 63 ఏళ్ల ప్రముఖ మందుల టోకు వ్యాపారి వినీత్ మినోచా అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు.

సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి ఆయన కుమారుడు, కోడలు పార్టీ కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు వినీత్ మినోచాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మెడ, ఛాతీ భాగాలపై తీవ్రమైన కత్తిపోట్లు ఉన్నాయి. తెల్లవారుజామున ఇంటికి తిరిగివచ్చిన కుమారుడు, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ హత్య కేసులో ఊహించని దిగ్భ్రాంతికర మలుపు చోటుచేసుకుంది. మామగారు హత్యకు గురైనప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి కన్నీరుమున్నీరుగా విలపించిన కోడలు శాలునే ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు శాలును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తొలుత ఇంట్లోకి చొరబడిన అపరిచితులు చేసిన హత్యగా భావించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్, లోతైన విచారణ తర్వాత ఇది కుటుంబ సభ్యులే పన్నిన కుట్రగా తేలింది.

పోలీసుల కథనం ప్రకారం… వినీత్ మినోచా తన కొడుకు, కోడలి విలాసవంతమైన ఖర్చులపై ఆంక్షలు విధించేవారు. కోట్లలో ఆస్తి ఉన్నప్పటికీ తమకు నచ్చినట్లు డబ్బు ఖర్చు చేయలేకపోతున్నామన్న తీవ్ర అసంతృప్తి కోడలిలో మొదలైంది. ఈ కారణంతోనే మామను అడ్డుతొలగించుకోవాలని పథకం వేసి, తమ ఇంట్లో పనిచేసిన పాత నౌకరు విశాల్‌ను సంప్రదించింది. హత్యకు రూ.6 లక్షల సుపారీ మాట్లాడుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంఘటన జరిగిన రాత్రి శాలు తన భర్త, పిల్లలతో కలిసి పార్టీ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వారు వెళ్లిన కొద్ది నిమిషాలకే పాత నౌకరు విశాల్, అతని అనుచరుడు రాజ్‌కిషోర్ ఇంట్లోకి ప్రవేశించి సుమారు గంటకు పైగా అక్కడే దాక్కున్నారు. వినీత్ మినోచా ఇంటికి రాగానే వారిద్దరూ కలిసి ఆయనను హతమార్చారు. మొదట దీనిని గుండెపోటుగా చిత్రీకరించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో కత్తితో దాడి చేసి చంపినట్లు విచారణలో తేలింది.

హత్య అనంతరం ఇంటికి తిరిగివచ్చిన శాలు, మామ మృతి చూసి ఏమీ తెలియనట్లు కన్నీరు కార్చింది. అయితే సీసీటీవీ దృశ్యాలు, నిందితుల వాంగ్మూలం, పాత నౌకరుతో ఆమె జరిపిన ఫోన్ సంభాషణల ఆధారంగా శాలు పాత్రపై పోలీసులకు బలమైన ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్టు చేశారు.


Posted

in

by

Tags: