సోషల్ మీడియాలో గుండెల్ని పిండేసే ఒక భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక క్రూరమైన మొసలి తన బలమైన దవడలతో ఒక వ్యక్తి కాళ్లను పట్టుకుని లోతైన నీటిలోకి లాగడానికి ప్రయత్నిస్తోంది.
తన ప్రాణాలను కాపాడుకోవడానికి పక్కనే ఉన్న చెరువు గట్టును గట్టిగా పట్టుకుని ఆ వ్యక్తి ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యం, అతడిని రక్షించడానికి స్థానికులు పోరాడుతున్న తీరు చూసేవారి రక్తాన్ని గడ్డకట్టించేలా ఉంది.
న్యూయార్క్ పోస్ట్ నివేదించిన వివరాల ప్రకారం, ఈ ఘోర దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ దురదృష్ట కార్మికుడు చికిత్స ఫలించక మరణించాడు. పాపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీలోని ప్రసిద్ధ అడ్వెంచర్ పార్క్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఆ పార్కులో పనిచేసే ఒక ఉద్యోగి మొసలికి ఆహారం అందించడానికి దాని ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. చేతిలో కోడి మాంసాన్ని పట్టుకుని మొసలిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండగా, ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆ భారీ మొసలి ఒక్కసారిగా అతనిపైకి దూకి దాడి చేసింది.
ప్రత్యక్ష సాక్షి గిబ్సన్ జాన్ ఏబీసీ మీడియాతో మాట్లాడుతూ, “ఆ కార్మికుడు ఎన్‌క్లోజర్ నెట్ దగ్గరకు కోడిని తీసుకురాగానే మొసలి మెరుపు వేగంతో అతడిని నోట కరుచుకుంది. ఆ తర్వాత అతడిని నీటిలోకి లాగడానికి ప్రయత్నించింది. అతను తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయాడు; కనీసం అరవలేని స్థితిలో అతని ముఖం, కళ్లలో కనిపించిన భయం అందరినీ వణికించింది. ఆ సమయంలో అతను ‘నేను ఎలాంటి తప్పు చేయలేదే’ అంటూ గుండెలవిసేలా రోదించాడు” అని తెలిపారు.
షాకింగ్ విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి దాదాపు గంటకు పైగా ఆ భారీ మొసలి బలమైన దవడల మధ్యే చిక్కుకుని నరకయాతన అనుభవించాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మొసలిని కాల్చి చంపారు. ఆ తర్వాతే ఆ కార్మికుడిని మొసలి పట్టు నుంచి విడిపించగలిగారు.
అనంతరం అతడిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొసలి దాడిలో అతను ఒక కాలును పూర్తిగా కోల్పోయాడు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు. మృతుడు ఉత్తర పాపువా న్యూ గినియాకు చెందినవాడని, గత రెండేళ్లుగా ఆ పార్కులో పనిచేస్తున్నాడని తెలిసింది.
ఈ ఘోర ప్రమాదం తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆ అడ్వెంచర్ పార్క్‌ను మూసివేశారు. అడవి జంతువులకు అతి సమీపంగా వెళ్లినప్పుడు ఎలాంటి పెను ప్రమాదాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి ప్రపంచానికి హెచ్చరికగా నిలిచింది.
